RTC bus accident in Vijayawada: విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగిన ప్రమాదంలో బాపట్ల జిల్లా చీరాలలోని ఉజిలిపేట చెందిన కుమారి, ఆమె మనవడు మృతి చెందారు. మనవడికి అన్నప్రాసన చేసి.. పేరు పెడదామని ఎంతో ఆనందంతో కుమార్తె ఇంటికి తీసుకెళ్లడానికి కుమారి విజయవాడ వెళ్లారు. కుమార్తె ఇంటి నుంచి విజయవాడ బస్టాండ్‌కు చేరుకోగా.. ప్రమాదంలో కుమారితో పాటు ఆమె మనవడు మృతి చెందగా.. కుమార్తె ఝాన్సీ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వార్త తెలియడంతో చీరాలలోని ఉజిలిపేటలోని మృతురాలి గ్రామంలో విషాదం నెలకొంది. మనవడికి శుభ కార్యక్రమం చేయాలనుకొని వారిని తీసుకురావడానికి వెళ్లిందని.. ఇంతలోనే ఎంత ఘోరం జరిగిదంటూ వారు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఉజిలిపేటలో నివాసం ఉండే మోటాని కుమారికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరికి వివాహాలు అయ్యాయి. కుమార్తె ఝాన్సీ కుటుంబం విజయవాడలో ఉంటోంది. ఝాన్సీకి వివాహం అయి 18 సంవత్సరాలు, పెళ్లైన తరువాత ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. రెండో మనవడు వయస్సు ఎనిమిది నెలలు. ఇంకా పేరు పెట్టలేదు. ముద్దుగా చెర్రీ అని పిలుస్తారు. ఈ చిన్నారికి మరో నాలుగు రోజుల్లో తన ఇంటిలో అన్నప్రాసన కార్యక్రమం చేసి.. పేరు పెట్టాలని అమ్మమ్మ కుమారి అనుకుంది. అందుకోసం కుమారి ఆదివారం తన కుమారుడి పిల్లలను తీసుకుని ఒంగోలు వెళ్లింది. ఆ పిల్లల్ని అక్కడ వదిలేసి... తిరిగి రాత్రి విజయవాడకు చేరుకుంది. ఉదయం కుమార్తెతో పాటు మనవడ్ని తీసుకుని నెహ్రూ బస్ స్టాండ్‌కు చేరుకుంది. వారంతా అక్కడ చీరాల వైపు వెళ్లే బస్సు ఎక్కడానికి ఫ్లాట్ ఫారం వద్దకు వచ్చి నిల్చున్నారు. ఈ సమయంలో గుంటూరుకి చెందిన అద్దె ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్లాట్‌ఫాంపై నిలబడి ఉన్న వీరిపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో కుమారితో పాటుగా ఎనిమిది నెలల వయస్సున్న ఆమె మనవడు చెర్రీ మృతి చెందారు. కుమార్తె ఝాన్సీ కాలికి తీవ్ర గాయాలయ్యాయి.
తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో బాణసంచా పేలుడు కలకలం - అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
'కుమారి కుటుంబం ప్రాంతం నుంచి దాదాపు 25 ఏళ్ల క్రితం చీరాల్లోని ఉజిలిపేటకు వచ్చారు. భర్త రాజు కరెంటు పనిచేస్తాడు. అప్పటి నుంచి చుట్టుపక్కల వారితో కలిసి మెలిసి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఏడాది కిత్రం భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. కుమారి భర్త మరణించిన తరువాత అన్నీ తానై ఆకుటుంబాన్ని చూసుకుంటోంది. అద్దె ఇంటిలో ఉంటోంది. ఆ పక్కనే ఉన్న సొంత ఇంటిని అద్దెకు ఇచ్చారు. ప్రమాద విషయం తెలియడంతో మా గ్రామంలో విషాదం నెలకొంది. నిన్న ఈ సమయంలో ఇక్కడే ఉంది.. మనవడికి అన్నప్రాసన చేయాలని అనుకుంది. వాళ్లను తీసుకురావడానికి వెళ్లింది. ఇంతలోనే ఎంత ఘోరం జరిగింది.' -శాంతి, స్థానికురాలు
విజయవాడ బస్సు ప్రమాదంపై సీఎం జగన్, ఆర్టీసీ ఎండీ దిగ్భ్రాంతి- రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటన