Michaung cyclone into Bapatla : మిగ్‌జాం తుపాను బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. మరి కాసేపట్లో తీరాన్ని పూర్తిగా దాటనుంది. తీరం దాటాక స్వల్పంగా బలహీనపడనున్నట్లు ఐఎండీ (India Meteorological Department) నిర్ధారించింది. సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బాపట్ల తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. తీర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
మిగ్‌జాం బీభత్సం- భారీ వర్షాలకు 8 మంది మృతి, స్కూళ్లు బంద్
Michaung cyclone affected districts in AP : ప్రస్తుతం తీరప్రాంతంలో గంటకు 90నుంచి110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మిగ్‌జాం తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో.. కోనసీమ జిల్లాలోని పలు గ్రామాల్లో పంటలన్నీ జలమయం అయ్యాయి. అయినవిల్లి, అంబాజీపేట, పి.గన్నవరం మండలాల్లో మూడు రోజుల నుంచి కురిసిన అకాల వర్షం అన్నదాతలకు కన్నీటి వ్యథనే మిగిల్చింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటలు ఈ వర్షాల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి వరి పంట నేల కూలి పూర్తిగా దెబ్బతిన్నాయి. కల్లాలలో ఉన్న ధాన్యం తడిసి ముద్దవుతోందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.
ఉత్తర దిశగా కదులుతున్న తీవ్రతుపాను - కొంతభాగం సముద్రంలో ఉన్నట్లు ఐఎండీ వెల్లడి
Michaung cyclone affected districts : మిగ్‌జాం తుపాన్ ప్రభావం రైతులకు తీవ్ర అవస్థలు తెచ్చిపెట్టింది. భారీగా కురుస్తున్న వర్షాలకు పంటలంతా తడిచిపోయి కర్షకులకు నష్టాన్ని మిగిల్చింది. శ్రీకాళం జిల్లా వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో రైతుల వరి పంట సాగుచేస్తున్నారు. చేతికొచ్చిన పంట నీట మునిగి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో ఇప్పటికే వరి కోతలు పూర్తయ్యాయి. కొన్ని చోట్ల కోతలు కోసిన పంట పొలంలోనే ఉండిపోయింది. కోతలు పూర్తి చేసిన రైతులు నూర్పులు చేసి ధాన్యాన్ని కల్లాల్లో భద్రపరిచి ఉంచారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రైతులు ధాన్యాన్ని రక్షించుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తడిసిన ధాన్యం రంగు మారి కొనుగోలుకు ఆటంకంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిగ్‌జాం తుపాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు-వేల ఎకరాల్లో నేలకొరిగిన వరి