Bulls Race In Bapatla: సంక్రాంతి క్రీడల్లో భాగంగా బాపట్ల జిల్లాలో నిర్వహించిన ఎడ్ల బలప్రదర్శన పోటీలు ముగిశాయి. పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిన్నటి అర్థరాత్రికి ముగిసాయి. సీనియర్స్ విభాగం (జాక్ పాట్)లో ఏడు జతల ఎడ్లు పోటీలో తలపడినట్లు నిర్వాహకులు గోరంట్ల భాస్కరరావు తెలిపారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన ఎడ్ల జతలకు బహుమతులు అందజేశారు.
25 నిమిషాల కాలవ్యవధిలో 22 క్వింటాల బండను ఏ జత ఎడ్లు ఎక్కువ దూరం లాగితే ఆ జతను మొదటి విజేతగా ప్రకటిస్తారు. ఈ విభాగంలో మొదటి బహుమతి 1,00,116 రూపాయలు, రెండవ బహుమతి 70,116రూ, మూడవ బహుమతి 35,116రూ, నాల్గవ బహుమతి 20,116రూ, ఐదవ బహుమతి 11,116 రూపాయలుగా నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు.
తుది ఫలితాల కోసం ఎడ్ల పోటీలు నిన్న అర్థరాత్రి వరకు జరిగాయి. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామస్థులు, పట్టణాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. క్రీడా ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసి పోయింది. మరోవైపు ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా గుడివాడకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుని ఎడ్ల జత పోటీలో ఉన్నప్పుడు ప్రేక్షకులు జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు.. దీంతో ప్రాంగణమంతా కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది.
చివరి రోజు పోటీలను పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, గురజాల వైసీపీ పరిశీలకులు గొట్టిపాటి భరత్ లు తిలకించారు .
ఇవీ చదవండి: