Earth quake: బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో భూకంపాలు తరచూ నమోదవుతున్నాయి. 33 రోజుల వ్యవధిలో రెండోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పరిటాలవారిపాలెం, పల్నాడు జిల్లా పిచ్చుకలపాలెం, ప్రకాశం జిల్లా పొదిలి, మాదాలవారిపాలెం, కనిగిరి, హనుమంతునిపాడు, మర్రిపూడి మండలం దుక్కిరెడ్డిపాలెం, గొండ్ల సముద్రంలో భూమి స్వల్పంగా కంపించింది.
పొదిలి సమీపంలో భూకంపం సంభవించినట్లు హైదరాబాద్ భూగర్భ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త వీరరాఘవన్ వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై 2.5గా నమోదైనట్లు చెప్పారు. గతనెల 15న అద్దంకి పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఉదయం 10.30 గంటలకు సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 1.8గా నమోదైంది. బాపట్ల జిల్లా సంతమాగులూరు, బల్లికురవ ప్రాంతాలు భూకంపాల జోన్‌లో ఉన్నట్లు గతంలో పరిశీలించిన అధికారులు ప్రకటించారు.
కొండల్ని పిండిచేయడం, భూగర్భాల్లోకి తవ్వకాలు జరుపుతున్నందున సమతుల్యం లోపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. వీటి కారణంగానే భూకంపాలు సంభవిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇవీ చూడండి: