CM Jagan Visit Flood Affected Areas : సీఎం జగన్ చాలా అరుదుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయటపెడతారు. తుపాను, వరదలు సహా మరే పెద్ద సమస్య వచ్చినా సరే అవేవీ మినహాయింపు కాదు. అంతా సర్దుకున్నాక, జనజీవనం కాస్త మెరుగైన తర్వాత ఓ వారం రోజులకి తీరిగ్గా పరామర్శకు బయల్దేరతారు. పోనీ అప్పుడైనా ముఖ్యమంత్రి నేరుగా జనంలోకి వెళ్లడం, పొలాల్లోకి వెళ్లి దెబ్బతిన్న పంటల్ని చూడటం, జనంతో కలసిమెలసి వారి బాధలు వింటారా అంటే అలాంటివి ఏవీ మన సీఎం సారు పర్యటనలో ఉండవు. ముందే సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్, సమీకరించిన బాధితులు, సీఎం వచ్చే ప్రాంతాల్లో జనం రాకపోకలపై కఠిన ఆంక్షలు, బారికేడ్లు, పరదాలు ఇలా సాగుతుంది.
CM Jagan Visit Michaung Cyclone Affected Areas : తాజాగా తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని మిగ్‌జాం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సైతం భారీ వర్షాలు ఆగిపోయిన మూడు రోజులకు పర్యటించారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ మాత్రం వేగంగా కదిలిందైనా ఇప్పుడే. బహుశా ఎన్నికలు దగ్గరపడటం వల్ల కావొచ్చు. ప్రభుత్వానికి పెద్దెన ముఖ్యమంత్రే అలా ఉంటే ఇక మంత్రులు, అధికారులు సత్వరం స్పందిస్తారా?
విశాఖకు హుద్‌హుద్ : ఏ విపత్తు తలెత్తినా సీఎం, మంత్రులు వెంటనే రంగంలోకి దిగి ప్రజల్లోకి వెళ్లి వారి గోడు వినాలి. తాము అండగా ఉన్నామని భరోసా ఇవ్వాలి. ఇది కనీస బాధ్యత. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు బాధితుల్ని స్వయంగా కలిసి, వారి కష్టాల్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నప్పుడు మెరుగైన సాయం అందించగలరు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ హుద్‌హుద్ తుపాను. 2014 అక్టోబరు 12న ఈ పెనుతుపాను విశాఖను తాకింది. తీవ్రతను ముందే గుర్తించి దాన్ని ఎదుర్కొనేందుకు అప్పటి ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. హుద్‌హుద్ ఊహించనంత విధ్వంసం సృష్టించింది.
రైతులను నట్టేట ముంచిన జగన్ - నాలుగున్నరేళ్లలో ఒక్క టార్పాలిన్‌నూ ఇవ్వని వైసీపీ ప్రభుత్వం
యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టిన చంద్రబాబు : నష్టం తీవ్రత గురించి తెలియడంతో అప్పటి సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లోని సచివాలయం నుంచే హుటాహుటిన విశాఖ బయల్దేరినా రాత్రికి రాజమండ్రి వరకే వెళ్లగలిగారు. ఇంకా వర్షం పడుతుండటం, జాతీయరహదారిపై చెట్లు, విద్యుత్ స్తంభాలు పడి ఉండటంతో ప్రయాణం ముందుకు సాగలేదు. తర్వాతి రోజు ఉదయం రోడ్డుమార్గంలో బయల్దేరి మధ్యాహ్నానికి కష్టంమీద విశాఖ చేరుకున్నారు. తుపాను తీవ్రతకు అతలాకుతలమైన విశాఖ నగరంతోపాటు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం తుపాను సహాయ చర్యలు చేపట్టింది.
విశాఖలో వారం రోజులు : రవాణా, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థల్ని శరవేగంతో పునరుద్ధరించింది. ప్రజలకు నిత్యావసరాల్ని పంపిణీ చేసింది. ముఖ్యమంత్రి వారం రోజుల పాటు విశాఖ కలెక్టరేట్ ఆవరణలోని బస్సులోనే బసచేసి, దాన్నే "వార్‌రూం"లా మార్చుకుని సహాయ చర్యల్ని పర్యవేక్షించారు. పొరుగు రాష్ట్రల సీఎంలతో మాట్లాడి నిత్యావసర సరకులు తెప్పించడం మొదలు, ప్రధాని నరేంద్రమోదీకి పరిస్థితి తీవ్రతను వివరించి, ఆయన వెంటనే విశాఖ పర్యటనకు వచ్చేలా చేయడం వరకూ ప్రతి అంశాన్నీ సీఎం స్వయంగా పర్యవేక్షించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుల అవస్థలు - ధాన్యం కొనే దిక్కులేక ఎదురుచూపులు
బాధితుల్ని ఆదుకునేందుకు శరవేగంగా ఏర్పాట్లు : సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయో ఉదయం, సాయంత్రం సీఎం స్వయంగా విశాఖ వీధుల్లో పర్యటించి, ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, పొరుగు జిల్లాల్లో పర్యటించి బాధితుల్ని ఓదార్చారు. 2018 అక్టోబరులో తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాను తీవ్రంగా నష్టపరిచినప్పుడు కూడా ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ యంత్రాంగమంతా అక్కడే ఉండి బాధితుల్ని ఆదుకునేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేసింది. 1996 నవంబరులో కోనసీమను తుపాను అతలాకుతలం చేసినప్పుడు ప్రభుత్వం స్పందించిన తీరును అక్కడి ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. అప్పటి సీఎం చంద్రబాబు హుటాహుటిన రాజమహేంద్రవరం చేరుకుని 5 రోజుల పాటు అక్కడే ఉండి సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే తిరిగొచ్చారు.
ఆంక్షలతో రెడ్ కార్పెట్ పరామర్శ : ప్రతిపక్ష నేతగా ఓదార్పుయాత్ర, పాదయాత్రల్లో తల నిమురుతూ, ముద్దులు పెడుతూ జగన్ జనంపై ఎక్కడలేని ఆప్యాయత ప్రదర్శించేవారు. అధికారంలోకి వచ్చాక పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తుపాను, వరద బాధితుల పరామర్శకు వెళ్లినా ప్రజలపై తీవ్ర ఆంక్షలు పెడుతున్నారు. సీఎం ఎక్కడికి వెళ్లినా జనం బారికేడ్లకు అవతలే ఉంటారు. అది కూడా ముందుగా ఎంపిక చేసినవారినే అక్కడికి అనుమతిస్తారు. బారికేడ్లకు ఇవతలి నుంచే వారితో సీఎం మాట్లాడతారు. వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సీఎం పర్యటనలు ఎంత తూతూమంత్రంగా సాగుతాయో చెప్పడానికి శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల సందర్శనలే నిదర్శనం.
మొత్తం పర్యటనలో ఆయనెక్కడా పొలంలోకి దిగలేదు. పాడైన పంటనూ పరిశీలించలేదు. సీఎం మనసెరిగిన అధికారులు ఆయన ఏదో వేడుకకు వస్తున్నట్టు రెడ్ కార్పెట్ పరిచారు. సీఎం నేలమీద కూడా అడుగు పెట్టాల్సిన అవసరం లేకుండా జాతీయ రహదారిపైనే టెంట్లు, వాటిలో రెడ్‌కార్పెట్ ఏర్పాట్లు చేశారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో రైతులతో సీఎం ముఖాముఖి అంటూ కొందరు రైతుల్ని పిలిపించినా, వారితో మాట్లాడకుండానే సీఎం పర్యటన ముగించారు. బాపట్ల జిల్లాలో ఆటోలో ఆస్పత్రికి వెళుతున్న గర్భిణిని సీఎం పర్యటన ఉందంటూ పోలీసులు రోడ్డుపైనే దించేశారు. హైవేపై హెలిప్యాడ్ ఏర్పాటుచేసి సీఎం పర్యటన ముగిసేవరకూ వాహనాలు నిలిపేశారు.
మసిపూసి మారేడు కాయ చేసేందుకు ప్రయత్నాలు : గోదావరి ఉప్పొంగి కోనసీమ జిల్లాలోని ముంపు ప్రాంతాలు, లంకలతో పాటు విలీన మండల్లాలోని అనేక ప్రాంతాలు కకావికలం అయ్యాయి. గోదావరి మహోగ్రరూపానికి పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. పునరావాసం, ప్యాకేజీలు ఇవ్వకపోవడంతో ముంపు ప్రాంతాల్లోనే ఉంటున్న వారు వరద ఉద్ధృతికి సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఏళ్లుగా తాము కష్టాలు పడలేమన్న విలీన మండలాల ప్రజలు సాయం కోసం దీనంగా ఎదురుచూశారు. ఇక్కడ కూడా సీఎం పర్యటన ఓ ప్రహసనంలానే సాగింది. ముందే ఎంపిక చేసి, తర్ఫీదు ఇచ్చిన వారితో మాట్లాడిన సీఎం జగన్ అంతా బాగుందని, నువ్వు దేవుడివన్నా అంటూ వారితో పొగిడించుకున్నారు. కొందరు బాధితులు తమతో సీఎం మాట్లాడాలని నినాదాలు చేసినా పోలీసులు వారిని అనుమతించలేదు.
హామీలు ఇవ్వడం, మరిచిపోవడం జగన్ నైజం : ఇలాంటి రెడ్‌కార్పెట్ పర్యటనలు సీఎంకి కొత్తేమీ కాదు. అన్నమయ్య జిల్లాలో 2021 నవంబరు 21న భారీగా వరద పోటెత్తడంతో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. భారీగా ప్రాణ, ఆస్తినష్టం జరిగింది. ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయాయి. ముఖ్యమంత్రి తీరిగ్గా డిసెంబరు రెండో తేదీన పరామర్శకు వెళ్లారు. వారికి సీఎం ఇచ్చిన హామీలు ఇప్పటివరకూ నెరవేరలేదు. పునరావాస కాలనీల నిర్మాణమే ఇంకా పూర్తికాలేదు.
ఫొటో గ్యాలరీతో సరి పెట్టేశారు : 2019 సెప్టెంబరులో కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్‌ను వరదలు ముంచెత్తినప్పుడూ జగన్ ఏరియల్ సర్వేతో సరిపెట్టారు. నంద్యాలలో ఫొటో గ్యాలరీని సందర్శించారు. విపక్ష నేతగా ఉన్నప్పుడు తిత్లీ తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లా నష్టపోతే పొరుగునే ఉన్న విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లలేదు. తర్వాత తీరిగ్గా వెళ్లి ప్రభుత్వం అందించే సాయం చాలదని, ఇంకా ఎక్కువ ఇవ్వాలని డిమాండు చేశారు.
జగన్ పాటిస్తున్న సూత్రం ఎవ్వరూ పాటించరేమో : ప్రకృతి విపత్తులతో నష్టపోయిన ప్రాంతాల పర్యటనకు ఆలస్యంగా వెళ్లడానికి సీఎం ఓ సూత్రం చెబుతుంటారు. తాను వెంటనే వస్తే అధికార యంత్రాంగమంతా తన వెనకే ఉంటుందని, దానివల్ల సహాయక చర్యలకు అవరోధం కలుగుతుందని చెబుతారు. తిరుపతి, బాపట్ల జిల్లాల పర్యటనల్లోనూ అదే చెప్పారు. తన పర్యటనకు కలెక్టర్‌తో పాటు సీఎంవో అధికారులు ఉంటే సరిపోతోందని మిగిలిన సిబ్బంది ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల్లోనే ఉండాలని ఆదేశాలు ఇస్తే సరిపోతుంది కదా. పైగా సహాయ కార్యక్రమాల్లో వేగం కూడా పెరుగుతుంది. కానీ ఇవేవీ మన సీఎం జగన్‌కి పట్టవు.
రైతు కష్టాలు పట్టించుకోని సీఎంను దేవుడు కూడా క్షమించడు : చంద్రబాబు