Child labor: బడికి వెళ్లాల్సిన వయస్సులో ఇటుక బట్టిల్లో చిన్నారులు వెట్టి చాకిరి చేస్తున్నారు.. వారి బ్రతుకులు బుగ్గిపాలు అవుతున్నాయి.. కార్మిక శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు.. వారిపై కనీసం కన్నెత్తి చూడటం లేదు. ఆ చిన్నారులను చుస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లుతాయి.. నిండా పది సంవత్సరాలు కూడా నిండని చిన్నారులు.. మండు టెండలో రోజంతా పదిహేను కేజీల బొగ్గు డిప్పలు నెత్తిన పెట్టుకుని సుమారు 40 అడుగుల ఎత్తు ఉన్న ఇటుక బట్టీలు ఎక్కి బొగ్గు నింపుతున్నారు.. చేతులు బొబ్బలు ఎక్కినా పోట్టకూటి కోసం పనులు చేయక తప్పని పరిస్థితి వారిది.. వరంగల్ ఇతర ప్రాంతాల నుండి డిసెంబర్ నెల నుండి మే నెల వరకు అనగా ఆరు నెలల పాటు తల్లిదండ్రులతో పాటు రాత్రి పగలు కష్టపడతారు.
ఏమీ పట్టనట్టు అధికారుల తీరు.. ఆడుతూ పాడుతూ స్కూల్‌కి వెళ్లాల్సిన వయసులో బాల కార్మికులుగా వెట్టి చాకిరి చేయిస్తున్నా.. కార్మిక శాఖ అధికారులు కనీసం కన్నెత్తి చూడటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈడు పిల్లలు బడిలో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నా స్థానిక గ్రామ సచివాలయ వ్యవస్థ, విద్యాశాఖ, రెవిన్యూ, కార్మిక శాఖ వారు ఈ చిన్నారుల అవస్థలు నిత్యం చూస్తున్నా.. ఒక్క అధికారి కూడా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. బాపట్ల జిల్లా, కొల్లూరు ఆంటే గుర్తుకొచ్చేది ఇటుకల తయారీ యూనిట్లు.. కొల్లూరు నుండి ప్రక్క రాష్ట్రాలకు సైతం ఇటుకలు ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయలు టర్నోవర్ జరుగుతుంది. కొల్లూరు ప్రాంతంలో సుమారు 150 వరకు ఇటుక బట్టీలు ఉన్నాయి.
తక్కువ వేతనాలు ఇచ్చి శ్రమ దోపిడీ.. ఇక్కడ ఇటుకలు తయారీకి స్థానికులను కాకుండా వరంగల్, ఖమ్మం ఇతర జిల్లాల నుంచి.. ఒడిశా, బిహార్ ఇతర రాష్టాల కార్మికులను తక్కువ రేటుకు తీసుకువచ్చి ఇటుకలు తయారు చేయిస్తారు. ఇటుక బట్టిల్లో పని చేసే కార్మికులకు వేతన చట్టంలో అనేక నిబందనలు ఉన్నా వేతనాలు బ్యాంకు ద్వారా మాతమ్రే.. చెల్లించాల్సి ఉన్నప్పటికి ఇటుక బట్టి యజమానులు తక్కువ వేతనాలు ఇచ్చి వారి శ్రమను దోచుకుంటున్నారు.
నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించేలా చర్యలు.. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం, టేకుపల్లె, మెరకనపల్లె, మొదలగు గ్రామాల్లో అవనిగడ్డ మండలం, పాత ఎడ్లలంక, దక్షిణ చిరువోల్లంక, పులిగడ్డ గ్రామాల్లో సుమారు 30 వరకు నడుస్తున్న ఇటుక బట్టిల్లో చిన్నారులు బ్రతుకులు నలిగిపోతున్నాయి. ఇటుక బట్టిల్లో పని చేస్తున్న కార్మికులు బడికి వెళ్లే ఈడు ఉన్న చిన్నారులను స్థానిక విద్యాశాఖ అధికారులు బడిలో, హాస్టల్లో చేర్చాలని.. కార్మిక శాఖ వారు కార్మికులకు కనీస వేతన చట్టం నిబంధనల ప్రకారం వారికి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: