Illegal mining: అధికారం, ధనబలంతో కొందరు తమ గ్రామంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని విచారణ కమిటీకి బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లి వాసులు విన్నవించారు. అక్రమ మైనింగ్‌పై గ్రామస్థులు గతంలో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అడ్వకేట్ కమిషనర్ కె.రాజశేఖర్ నేతృత్వంలోని బృందం శనివారం గ్రామంలోని సర్వే నం 387-సీలో 350 ఎకరాల విస్తీర్ణంలోని గ్రావెల్ కొండలను పరిశీలించింది. గ్రావెల్ కొండలను కొందరు అక్రమంగా తవ్వుకుంటూ రూ.లక్షలు విలువచేసే ఎర్రమట్టిని విక్రయించుకుంటున్నారని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు కమిటీకి తెలిపారు.
పలుశాఖల అధికారులు అవినీతికి పాల్పడుతున్న వారిని పరోక్షంగా ప్రోత్సహిస్తూ తమనే బెదిరిస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా తవ్వకాలు చేపట్టిన ఓ లీజుదారుడిపై రూ.కోటి వరకు అపరాధ రుసుం విధించినా మైనింగ్ అధికారులు అతడి నుంచి వసూలు చేయడంలో విఫలమయ్యారని కమిటీకి తెలిపారు. గ్రావెల్ కొండలపై ఉన్న అన్ని మైనింగ్ అనుమతులను రద్దుచేసి, పర్యావరణాన్ని కాపాడాలని విన్నవించారు. అడ్వకేట్ కమిషనర్ రాజశేఖర్ మాట్లాడుతూ... విచారణ పూర్తయ్యాక తమ నివేదికను న్యాయస్థానానికి సమర్పిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: