House construction: ‘జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలు పునాదులకే సరిపోతాయి, ఇక ఇంటి నిర్మాణం ఎలా’ అని ఓ వృద్ధుడు బాపట్ల జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్ ఆయనకు సమాధానం చెప్పలేకపోయారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల తీరును పరిశీలించేందుకు కలెక్టర్ విజయకృష్ణన్.. గురువారం వేమూరు నియోజకవర్గంలోని చంపాడు లేఅవుట్‌కు వచ్చారు. హౌసింగ్, సచివాలయ సిబ్బంది పనితీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.
ఇంతలో వృద్ధుడు కలగజేసుకుని ‘అమ్మా.. పల్లంలో స్థలాలు కేటాయిస్తే మెరక చేసేందుకే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోతాయి. ఇక ఇల్లెలా కట్టాలని’ పదేపదే ప్రశ్నించారు. నేల మెరక చేయించేందుకు ప్రభుత్వమే చర్య తీసుకుంటుందని కలెక్టర్ సమాధానపరిచారు. నెల రోజుల్లో మళ్లీ వస్తానని.. పురోగతి లేకపోతే చర్యలు ఉంటాయని సిబ్బందిని హెచ్చరించారు.
జిల్లాలో జగనన్న కాలనీకి ఇచ్చిన స్థలాలు ఇళ్ల నిర్మాణానికి అనుకూలంగా లేవని.. కలెక్టర్ ముందు మరికొందరు లబ్ధిదారులు గోడు వెళ్లబోసుకున్నారు. పల్లపు ప్రాంతాల్లో స్థలం ఇస్తే ఇల్లు కట్టుకోవడం ఎలాగని ప్రశ్నించారు. పరిశీలనకు వచ్చే అధికారులు ప్రతిసారీ రోడ్డు పక్కనున్న లేఅవుట్లను మాత్రమే పరిశీలించి, దూరప్రాంతంలో లేఅవుట్ల పరిస్థితిని పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:
ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. జ్వరంతో బాధపడుతున్న బాలికకు షూగర్ మాత్రలు!