Power Lifter Advocate Woman Story: ఆమెది ఓ నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కూలినాలీ చేస్తే తప్ప పుాట గడవని వైనం. చిన్నప్పటి నుంచి ఆమెకు ఆటలంటే అమితమైన ఇష్టం. ఎప్పటికైనా దేశానికి పేరు తెచ్చే విధంగా క్రీడల్లో రాణించాలనేది లక్ష్యం. దీంతో పట్టుదలతో చదివింది. న్యాయశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేసి.. కోర్టులో ఉద్యోగం సాధించింది. ఓవైపు న్యాయస్థానంలో కేసులను వాదిస్తూనే, మరోవైపు తాను అనుకున్న లక్ష్యం కోసం కసరత్తు మొదలుపెట్టింది. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు సిద్థమై.. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని, కష్టపడే తత్వం, పట్టుదల, సాధించాలనే తపన, సరైన ప్రణాళికలు ఉండాలే గానీ ఏదైనా సాధించవచ్చునని నిరూపిస్తూ.. నేటి యువతకు, ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.
బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన పరుచూరి కుమారి.. గ్రామీణ ప్రాంతంలోని ఓ పేదింట్లో జన్మించారు. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి.. దేశానికి పేరు తెచ్చేలా పవర్ లిఫ్టింగ్‌లో రాణిస్తున్నారు. అంతేకాదు ఓవైపు క్రీడల్లో సత్తా చాటుతూనే.. మరోవైపు చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండా ముందుకు సాగింది. ఫిట్‌నెస్ కోసం జిమ్‌లో బరువులెత్తే సాధనను కొనసాగిస్తూనే.. న్యాయశాస్త్రంలో, జర్నలిజంలో మాస్టర్స్ పూర్తి చేశారు. కోర్టులో పేదల ప్రజల కేసులను వాదిస్తూనే.. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఆమె సిద్ధమవుతున్నారు.
చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకున్న కుమారి.. పాఠశాల స్థాయిలోనే అనేక పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఒంగోలు శర్మ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో.. సహచర విద్యార్థులను చూసి పవర్ లిఫ్టింగ్‌లో సాధన ప్రారంభించారు. భక్తద్రువుడు అనే కోచ్ వద్ద శిక్షణ పొంది.. తొలి ప్రయత్నంలోనే నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాల పోటీల్లో పతకాలు సాధించారు. 2014 నుంచి వరుసగా నాలుగుసార్లు రాష్ట్రస్థాయి ఛాంపియన్ షిప్ ఆమె వశమైంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో బంగారు, వెండి పతకాలు సాధించారు.
నాకు మొదట్నుంచి ఇండియా తరపున అంతర్జాతీయ స్థాయిలో మహిళ పవర్ లిఫ్టింగ్‌లో ఆడి, ఇండియాకు పతకాలు సాధించి, మన జాతీయ జెండాను విదేశాల్లో ఎగరవేయాలనేదే నా కల. దానికోసం మళ్లీ కసరత్తులు చేస్తున్నాను. ప్రస్తుతం గుంటూరులోని వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ కోచ్ ఎం.డి. కమ్‌రుద్రీన్ గారి వద్ద శిక్షణ తీసుకుంటున్నాను. సార్ వాళ్ల ఇచ్చిన ప్రోత్సహంతో 2022లో సౌత్ ఇండియా గోల్డ్ మోడల్ కొట్టాను. రీసెంట్‌గా రాష్ట్రస్థాయిలో మూడు గోల్డ్ మోడల్స్ కొట్టాను. ఆ తర్వాత రెండు నేషనల్ స్థాయిలో పాల్గొని బెస్ట్ ఆఫ్ ది 5లో కొనసాగుతున్నాను. -కుమారి, పవర్ లిఫ్టర్
పవర్ లిఫ్టింగ్‌లో పతకాలు సాధిస్తున్నా.. చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఒంగోలు ప్రియదర్శిని న్యాయ కళాశాలలో ఎల్ఎల్‌బీ పూర్తి చేసి.. గుంటూరు బార్ కౌన్సిల్లో సభ్యత్వం పొందారు. చదువు కారణంగా కొన్నాళ్లు పవర్ లిఫ్టింగ్‌కు దూరమైనా.. తన గురువు సీనియర్ న్యాయవాది నరసింహారావు ప్రోత్సాహం, ఆర్థిక సాయంతో మళ్లీ సాధన ప్రారంభించారు. కోర్టులో వాదనలు వినిపిస్తూనే.. గుంటూరు బార్ అసోషియేషన్ సభ్యుల సహకారంతో పోటీలకు సిద్ధమవుతున్నారు. ఇంటికి పెద్దగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. నిరంతరం కష్టపడుతూ అందరికీ స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని.. కష్టపడే తత్వం, సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే అంటున్న పరుచూరి కుమారి నంద.. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇవీ చదవండి