Addanki Police Station Constable Suspended: అతనో సీఐ. విధి నిర్వహణలో సక్రమంగా ఉండాల్సిన అతను.. అనుమానంతో ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయించాడు. తనకు సంబంధించిన ఆడియోలను వాట్సప్ గ్రూపుల్లో సెండ్ చేశాడని కక్ష గట్టి ఓ మహిళా కానిస్టేబుల్‌తో ఫిర్యాదు ఇప్పించాడు. దాంతో ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం సీఐని వీఆర్‌కు పంపించారు. ఈ నేపథ్యంలో ఓ ట్విస్ట్ నెలకొంది. కానిస్టేబుల్‌పై ఫిర్యాదు ఇచ్చిన మహిళా పోలీసు.. నిన్న సాయంత్రం స్టేషన్‌కు వచ్చి పైఅధికారుల బలవంతం వల్లే కంప్లైంట్ ఇచ్చినట్లు రాతపూర్వకంగా రాసిచ్చింది. ఈ ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది.
అద్దంకి పోలీసుస్టేషన్లో సీఐగా పనిచేస్తున్న రోశయ్య, కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ రోశయ్య వీఆర్‌కు వెళ్లగా.. అదే స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. అద్దంకి ప్రస్తుత సీఐ ఉమేష్ అందించిన సమాచారం మేరకు.. 'పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాలలో పని చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. ఆమె వివాహ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నాడని ఫిర్యాదు అందింది. ఈ మేరకు కానిస్టేబుల్ రాజశేఖర్‌పై కేసు నమోదు చేశాం' అని సీఐ వెల్లడించారు. కానిస్టేబుల్ని బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాను ఏ మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని.. కావాలనే తన పైఅధికారి కేసులో ఇరికించారని అతను బోరున విలపించారు.
అధికారుల ఒత్తిడితోనే అంటూ వివరణ: అయితే ఈ నేపథ్యంలో కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేసిన మహిళా కానిస్టేబుల్ బుధవారం సాయంత్రం ప్లేటు ఫిరాయించింది. తాను గత సీఐ, ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు అలా చేశానని.. ప్రస్తుత సీఐ ఉమేష్‌కు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చింది. సీఐ ఆమె ఫిర్యాదును తీసుకొని పూర్వాపరాలు విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అసలేం జరిగిందంటే.. అద్దంకిలో సీఐగా పని చేస్తున్న రోశయ్య రాసలీలలకు సంబంధించిన ఆడియోలు వాట్సప్ గ్రూపులలో హల్చల్ చేశాయి. అవి ఉన్నతాధికారులకు చేరటంతో రోశయ్యను వీఆర్‌కు పంపంచారు. అయితే తనకు సంబంధించిన ఆడియోలను తన స్టేషన్లో పని చేసే కానిస్టేబుల్ రాజశేఖర్ విడుదల చేసి ఉంటాడని అనుమానించిన రోశయ్య.. ఓ మహిళా కానిస్టేబుల్చే అతనిపై ఉన్నతాధికారుల వద్ద ఫిర్యాదు చేయించారు. ఆమె ఫిర్యాదుతో కానిస్టేబుల్ రాజశేఖర్‌ని మంగళవారం సస్పెండ్ చేశారు. బుధవారం సాయంత్రం మహిళా కానిస్టేబుల్ తన ఫిర్యాదు నిరాధారమైనదని.. తనని ఎవరు ఇబ్బంది పెట్టలేదని.. ఈ ఫిర్యాదు తన పైఅధికారుల ఒత్తిడితో చేశానని లిఖితపూర్వకంగా వ్రాసి ఇవ్వటం కొసమెరుపు