ysrcp leaders attack on tdp leaders: అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో.. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా.. తెలుగుదేశం శ్రేణులు పెద్దఎ్తతున పార్టీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. టీడీపీ బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చించివేశారు. బ్యానర్లు చించివేస్తున్న వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే సమయంలో ఘర్షణ మొదలైంది. తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాలతో వైసీపీ మూకలు రెచ్చిపోయారు. దాడులకు దిగారు. టీడీపీ కార్యకర్తలపైకి రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు.. చెదరగొడుతున్నా వాళ్లేదురుగానే వైసీపీ శ్రేణులు దాడికి దిగారు. ఈ దాడిలో.. మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్రకు గాయాలయ్యాయి. ఇదే సమయంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అంగళ్లు గ్రామానికి చెరుకున్నారు. వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్న పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. గాయపడిన కార్యకర్తలకు చికిత్స చేయించాలని సూచించారు. ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నాడు.. ఈ రావణాసురుడికి ఎమ్మెల్యే ట్యాగ్ ఉందని ఎద్దేవా చేశారు. వీరందరూ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. నేను పులివెందులకే వెళ్లాను.. ఇక్కడికి రాకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇలాంటి నాయకులను రాజకీయంగా భూస్థాపితం చేయాలన్నారు. తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. డీఎస్పీ తన యూనిఫామ్ తీసేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా ధైర్యం ఉంటే రండి చూసుకుందాం అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని అన్నారు.
Police lathi charge on TDP leaders.. చంద్రబాబు అంగళ్లులో పర్యటనను ముగించుకుని పుంగనూరు వెళ్తుండా వైసీపీ శ్రేణులు లారీ అడ్డు పెట్టారు.. ఆ లారీని అడ్డు తీయాలని తెలుగుదేశం కార్యకర్తల ఆందోళన చేయగా పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి.. బాష్పవాయువు ప్రయోగించారు. పరిస్థితి మరింత ఉద్రితంగా మారడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా పోలీసు వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
Why Not Punganur.. పుంగనూరులో విధ్వంసానికి మంత్రి పెద్దిరెడ్డే కారణమని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలకు పోగాలం వచ్చిందన్నారు. అధికారపార్టీకి దాసోహం కావద్దని పోలీసులకు.. విజ్ఞప్తి చేశారు. పుంగనూరు బైపాస్ వద్ద చంద్రబాబు వాహనంపైనుంచి మాట్లాడారు. పుంగనూరుకు పెద్దిరెడ్డి ఏమైనా పుడింగా అని మండిపడ్డారు. ఈ రోడ్డు మార్గంలో రావొద్దనడానికి.. ఈ రహదారి మీ తాత జాగీరు కాదు కాదా అని నిలదీశారు. తెలుగుదేశం శ్రేణులు తిరగపడితే వైసీపీ పారిపోవడం ఖాయమని హెచ్చరించారు. మరో రోజు పుంగనూరు ఊళ్లోకి కూడా వస్తానని సవాల్ విసిరారు. తలలు పగలుకొడుతున్నా, రక్తాలు కారుతున్నా లెక్క చేయకుండా వచ్చారంటే.. కార్యకర్తల రోషానికి సలామని అన్నారు. తెలుగుదేశం కార్యకర్తపై పడిన ప్రతిదెబ్బ నాపై పడినట్లేనని ఉద్ఘాటించారు. ప్రజలకు బాధ, ఆవేశం ఎంత ఉందొ తనకూ అంతే ఉందని చంద్రబాబు తేల్చిచెప్పారు. వై నాట్ పుంగనూరు అని గట్టిగా నినదించారు. పుంగనూరు బైపాస్ వద్దకు భారీగా చేరుకున్న తెలుగుదేశం కార్యకర్తలు భారీగా బాణసంచా కాల్చి చంద్రబాబుకు గజమాలలతో ఘన స్వాగతం పలికారు. పుంగనూరు బైపాస్ సెంటర్లో సైకో పోవాలి సైకిల్ రావాలి అనే పాటను ప్రదర్శించారు.