Nara Lokesh comments on Global Investors Summit: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్ర 36వ రోజుకు చేరుకుంది. పాదయాత్రకు ప్రారంభానికి ముందు.. క్యాంప్ సైట్ నుంచి మీడియాతో మాట్లాడారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో 374 సంస్ధలతో ఒప్పందాలు చేసుకున్నామని ప్రకటించిన ప్రభుత్వం కేవలం 74 సంస్ధల పేర్లు మాత్రమే బయట పెట్టిందన్నారు. మిగిలిన పరిశ్రమల సంగతేంటని ప్రశ్నించారు. ఇండోసోల్ పరిశ్రమ పేరుతో 25 వేల ఎకరాల భూమిని దోచేస్తున్నారని ఆరోపించారు. పీపీఏలు రద్దు, పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు తరిమికొట్టడం తప్ప జగన్ సాధించింది ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి ఫుల్.. పరిశ్రమలు నిల్ అని అన్నారు.
అది ఫేక్ సమ్మిట్: విశాఖపట్నంలో జరిగింది గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కాదని.. లోకల్ ఫేక్ సమ్మిట్ అని లోకేశ్ విమర్శించారు. టీడీపీ పాలనలో తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని లోకేశ్ తెలిపారు. వైఎస్సార్సీపీ పాలనలో పీపీఏలు రద్దుచేశారు, పరిశ్రమలు తరిమేశారని మండిపడ్డారు. దేశం పరువు తీయవద్దని కేంద్రం స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు. లులూ సంస్థను రూ.2 వేల కోట్లు పెట్టకుండా తరిమేశారని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందని పారిశ్రామికవేత్తలు చెప్పారని లోకేశ్ అన్నారు. ప్రముఖ కంపెనీలు బైబై ఏపీ అంటున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు విస్తరణ చేయట్లేదని తెలిపారు.
టీడీపీ హయాంలో: చంద్రబాబు నాయుడు ఒక ప్రణాళిక పెట్టుకొని.. అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన ఒకే దగ్గర ఉండాలని పని చేశారని అన్నారు. 2014 నుంచి 2019 వరకూ 39 వేల 450 పరిశ్రమలు వచ్చాయని.. దీని ద్వారా సుమారు 5 లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఈ లెక్కలు వైఎస్సార్సీపీ మంత్రే.. ఆనాడు చెప్పారని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి అనేక కంపెనీలు తీసుకొచ్చామని లోకేశ్ చెప్పారు.
రెండు లక్షల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పాదన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రకటనలే తప్ప ప్రముఖ సంస్థలు పెట్టుబడులపై ప్రకటనలు చేయట్లేదని విమర్శించారు. జగన్ సీఎం అయ్యాక భారతి సిమెంట్ పరిశ్రమ మాత్రమే బాగుపడిందని అన్నారు. టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమల ముందు నేను సెల్ఫీ దిగి చూపిస్తున్నాని తెలిపారు. మీ పరిపాలనలో తీసుకొచ్చిన పరిశ్రమలు ఏం ఉన్నాయో వాటిని జగన్ సెల్ఫీ దిగి చూపిస్తారా? అని ప్రశ్నించారు. ఉద్యోగాలు నిల్, గంజాయ్ ఫుల్ అన్నట్లు రాష్ట్ర పరిస్థితి ఉందని మండిపడ్డారు. ఏపీ ప్రథమస్థానంలో ఉంది.. కేవలం గంజాయి సరఫరాలో మాత్రమే అని తెలిపారు.
"బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రరాష్ట్రానికి తెలంగాణ కంటే 19 వేల 500 కోట్ల పెట్టబడులు ఎక్కువగా వచ్చాయి. నిరుద్యోగ శాతం కూడా 3.6 శాతానికి పడిపోయింది. నేను ఈ పాదయాత్రలో కేవలం ఈ చిత్తూరు జిల్లాలోనే అనేక సెల్ఫీలు దిగాను. మేము తీసుకొచ్చిన కంపెనీలు దగ్గర నేను సెల్ఫీ దిగి ఒక ఛాలెంజ్ చేశాను. జగన్ గారూ మీరు కూడా.. మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ దగ్గర సెల్ఫీ దిగండి చాలు.. అది పోస్ట్ చేయండి అన్నాను. రాష్ట్రంలో ఉద్యోగాలు నిల్.. గంజాయి ఫుల్. ఆంధ్ర రాష్ట్రం ఎందులో అయినా నెంబర్ వన్ ఉంది అంటే.. అది గంజాయిలోనే". - నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి: