MLA HARASSMENT IN ANNAMAYYA DISTRICT : అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తనపై కేసులు పెట్టించి వేధిస్తుండటంతో.. ఆవేదనకు తన మామ గుండెపోటుతో చనిపోయాడని.. సుండుపల్లి మండలానికి చెందిన సిద్ధార్థగౌడ్ ఆరోపించారు. సుండుపల్లి మండలం దిన్నెల గ్రామానికి చెందిన సిద్ధార్థ గౌడ్.. రాష్ట్ర డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు.
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగిలో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉన్నాడు. అప్పుడప్పుడు స్వగ్రామమైన దిన్నెలకు వచ్చి పోతుంటాడు. అందులో భాగంగానే ఇటీవల సుండుపల్లి మండలంలో ఓ జాతీయ నేత విగ్రహం.. మురికి కాల్వల మధ్య పడేసిన వైనాన్ని ప్రశ్నిస్తూ.. ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి వైఖరిని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించాడు. ఎమ్మెల్యే పనితీరును ప్రశ్నిస్తూ పలుమార్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడు. దీంతో సిద్ధార్థగౌడ్పై నందలూరు, రాయచోటి, సుండుపల్లి, రాజంపేట పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
అయితే ఈ కేసులన్నీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఒత్తిడితోనే నమోదయ్యాయని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈనెల 10న మామ కర్మదినం సందర్భంగా.. ఆయన సమాధి వద్ద సెల్పీ వీడియో, సాధారణ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. తన మామ చావుకు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డే కారణం అని సిద్ధార్థగౌడ్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తన మామ చావుకు కారణమైన ఎమ్మెల్యేకు రాజకీయ సమాధి కడతానని శపథం చేస్తూ వీడియో పోస్టు చేశారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి.. నియోజకవర్గంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని వీడియోలో ఆరోపించారు. ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈయన పోస్టు చేసిన వీడియో వైరల్ గా మారింది.
ఇవీ చదవండి: