Pileru Womens : అన్నమయ్య జిల్లా పీలేరులో తమ వారిపై అన్యాయంగా పోలీసులు కేసులు పెట్టారని ముస్లిం మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి విషయంలో సంబంధం లేని తమ వారిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఫ్లెక్సీల విషయంలో తలెత్తిన గొడవలో తమ వారికి ఎలాంటి సంబంధం లేదని మహిళలు అంటున్నారు. అక్రమంగా కేసులు పెట్టి వారి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలు మా వాళ్లు ఏం చేశారని పోలీసులు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారని ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ నాయకులు మా వాళ్లపై దౌర్జన్యంగా దాడి చేస్తే ఎటువంటి చర్యలు లేవని అన్నారు. ఇప్పుడు తమ వారు ఫ్లెక్సీలు చించేశారనే నెపంతో హత్యాయత్నం కేసు నమోదు చేయటం దారుణమన్నారు. తమ వారిపై వైసీపీ నాయకులు దాడి చేస్తే తీవ్రగాయాలైనా పట్టించుకోలేదని మహిళలు ఆరోపించారు. వైసీపీ నాయకులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇవన్నీ ముఖ్యమంత్రికి కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఈ దాడులను నియంత్రించటం చేతకాకపోతే ముఖ్యమంత్రి.. తన వల్ల కాదని, సీఎం కుర్చీ నుంచి దిగిపోవాలని అన్నారు.
"సర్పంచ్ దాడి చేస్తే మా వాళ్లకు ముక్కులోంచి రక్తం కారింది. అయినా, అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఫ్లెక్సీలు చింపేశారని కేసులు పెట్టారు. వారికో న్యాయం.. మాకో న్యాయం ఉంటుందా. వైసీపీ నాయకుల పనులను ముఖ్యమంత్రి చూస్తున్నారా" -పీలేరు మహిళ
పీలేరులో చంద్రబాబు పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. పీలేరు ఉప కారాగారంలో ఉన్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించటానికి ఆయన వెళ్లనున్నారు. ఈ పర్యటనకు పోలీసులు నిబంధనలు విధించారు. అంతేకాకుండా టీడీపీ వినియోగించే సౌండ్ బాక్స్‌లకు అనుమతి లేదని తెలిపారు. సౌండ్ బాక్స్‌లను రవాణా కోసం వినియోగించే వాహనాన్ని సీజ్ చేశారు.
ఇవీ చదవండి: