Nara Lokesh with handloom workers: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చేనేతపై జీఎస్టీ ఎత్తివేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అవసరం అయితే దానికి అయ్యే సొమ్ముని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం ఎనుమువారిపల్లిలో చేనేత కార్మికులతో నిర్వహించిన సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు.
చేనేత కళాకారులతో కలిసి లోకేశ్ రాట్నం తిప్పి నూలు వడికారు. చేనేత కార్మికులను ఆదుకున్నది టీడీపీ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. జగన్ పాలనలో చేనేత కార్మికులను ఆదుకోలేకపోయిందని ఆరోపించారు. చేనేత వస్త్రాలకు ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేస్తామన్న జగన్ మోసం చేశారని లోకేశ్ తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతకు ఒక ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేస్తామని హామీ ఇచ్చారు. చేనేతను మార్కెట్ లింకేజ్ ద్వారా అధిక ఆదాయం వచ్చేలా చేస్తామన్నారు.
టీడీపీ హయాంలో చేనేతల కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలను చేనేత కార్మికులకు లోకేశ్ వివరించారు. నేతన్న నేస్తం సైతం పెద్ద మోసమని లోకేశ్ ఆరోపించారు. కేవలం సొంత మగ్గాలు ఉన్న వారికి మాత్రమేనని జగన్ అంటున్నారని తెలిపారు. మదనపల్లెలో 20 వేల మంది చేనేత కార్మికులు ఉంటే కొంతమందికే నేతన్న నేస్తం అందుతుందన్నారు. జగన్ పాలనలో 60 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని స్వయంగా మంత్రే చెప్పారని గుర్తు చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబానికి కూడా న్యాయం జరగలేదని లోకేశ్ ఆరోపించారు. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల కొనుగోలు జరగడం లేదని వెల్లడించారు. దళారీ వ్యవస్థ పెరిగిపోయిందని ఆరోపించారు. వైసీపీ ఎంపీలు చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్రంతో ఎటువంటి పోరాటం చెయ్యడం లేదన్నారు.
జీఎస్టీ అంశంపై ఎంపి మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయలేదని... పార్లమెంట్లో పోరాడలేదని లోకేశ్ ఆరోపించారు. రెండోసారి లోక్ సభ సభ్యుడిని చేసిన చేనేత కార్మికుల కష్టాలు ఆయనకు పట్టవని ఎద్దేవా చేశారు. ఆయనకు కేవలం ఆఫ్రికాలో ఉన్న వ్యాపారాలు మాత్రమే ముఖ్యమని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే పవర్ లూమ్ కు 500 యూనిట్లు, చేనేతకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. టీడీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో 54 చేనేత క్లస్టర్స్ ఏర్పాటు చేశామని లోకేశ్ తెలిపారు. ఇప్పుడు కేంద్రానికి ఇవ్వాల్సిన వాటా ప్రభుత్వం ఇవ్వకుండా క్లస్టర్స్ ఏర్పాటు చెయ్యకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని లోకేశ్ ఆరోపించారు.
ఇవీ చదవండి: