YS Jagan Mohan Reddy will visit Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నాలుగో విడత జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనతో పోలీసులు, అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టమాటా మార్కెట్ యార్డును స్వాధీనం చేసుకుని బస్సుల పార్కింగ్‌కు కేటాయించి ఆ మేరకు బోర్డును ఏర్పాటు చేశారు. యార్డుకు సెలవు ప్రకటించి టమాటాలు తీసుకురావద్దని రైతులను కోరారు. అన్నమయ్యతో పాటు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విద్యా దీవెన కింద లబ్ధిదారులైన విద్యార్థులతో పాటు తల్లులను వెంట తీసుకురావాలని సచివాలయ సంక్షేమ సహాయకులను ఆదేశించారు. వీరికి ప్రత్యేకంగా బస్సులు కేటాయించారు. ప్రైవేటు పాఠశాలల వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులను సీఎం సభకు జనాన్ని తరలించేందుకు వినియోగిస్తున్నారు.
పల్లె వెలుగు సర్వీసులు రద్దు: మదనపల్లె పట్టణంలోని బీటీ కళాశాల నుంచి టిప్పు సుల్తాన్ మైదానం వరకు దారి మధ్యలో ఉన్న దుకాణాలను బుధవారం వేకువజాము నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూసివేయాలని పోలీసులు హెచ్చరించారు. హెలీప్యాడ్ నుంచి సభావేదిక వరకు ఇనుప బారికేడ్లు, రోడ్డుకిరువైపులా కర్రలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ముందస్తుగానే పల్లె వెలుగు సర్వీసులు రద్దు చేశారు. మంగళవారం రాత్రి రాయచోటి డిపో నుంచి పల్లెలకు ప్రయాణికులను చేరవేస్తున్న సర్వీసులను అధికారులు రాత్రి 8.30 గంటలకే పరిమితం చేశారు. అనంతరం వెళ్లాల్సిన సర్వీసులు చాలా మార్గాల్లో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విచారణ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. చంటిబిడ్డలతో తల్లులు, వృద్ధులు, విద్యార్థులు బస్సుల కోసం నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో అధిక ఛార్జీలు భరించి ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది.
వైకాపాలో వర్గ విభేదాలు: సీఎం జగన్ పర్యటన సందర్భంగా మదనపల్లె వైకాపాలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. పలువురు నేతలు పోటీలు పడి బీటీ కళాశాల నుంచి సభ జరిగే టిప్పు సుల్తాన్ మైదానం వరకు భారీగా కటౌట్లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే టిక్కెట్‌కు పోటీపడుతున్న మల్లెల పవన్‌కుమార్‌రెడ్డి భారీగా కటౌట్లు ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే నవాజ్ బాషా వర్గీయులు దానిని చింపివేశారు. ఎంపీ మిథున్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న 23వ వార్డు కౌన్సిలర్ గిరిజా సాయికుమార్ బ్యానర్లనూ తొలగించారు. తీవ్ర ఆగ్రహానికి గురైన పవన్‌కుమార్‌రెడ్డి, గిరిజా సాయిప్రసాద్ వర్గీయులు ఎమ్మెల్యే కటౌట్లను కొన్ని చోట్ల చించేశారు. పలుచోట్ల ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు పరస్పరం వివాదాలకు దిగారు.
ఇవీ చదవండి: