Attack on Student: పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నామని దీనికి రావాలని ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆహ్వానించి చితకబాదిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మదనపల్లి పట్టణం రామారావు కాలనీకి చెందిన ఆది రామ్మూర్తి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గతంలో కొందరు కలిసి ఒక యువకుడ్ని చితకబాదుతుంటే గమనించిన రామ్మూర్తి ఎందుకలా కొడతారని వారించాడు. దీంతో అతనిపై కోపం పెంచుకున్న అయిదుగురు యువకులు రామ్మూర్తిని లక్ష్యంగా చేసుకున్నారు. వీరంతా ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం రామ్మూర్తిని శనివారం జన్మదిన వేడుకలకు రావాలని నమ్మబలికారు.
వారి మాటలను నమ్మి వచ్చిన రామ్మూర్తిని.. తిరుపతి రోడ్డు సీటీఎం సమీపంలోని ఓ ప్రైవేటు పాల డెయిరీ వద్దకు తీసుకెళ్లారు. అయిదుగురు కలిసి విద్యార్థి రామ్మూర్తిని తీవ్రంగా గాయపడేలా చితకబాదారు. కాళ్లు పట్టుకున్న వేడుకున్నా వదలకుండా విచక్షణారహితంగా అందరూ కలిసి కొట్టారు. వారి వద్ద నుంచి తప్పించుకుని వచ్చిన రామూర్తి.. తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దీంతో వారు భయపడి తమ కుమారుడిని శనివారం బయటకు పంపలేదు. ఆదివారం రాత్రి మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ వెళ్లి జరిగిన ఘటన గురించి పోలీసులకు వివరించారు. అయితే పోలీసులు మొదట వీరి ఫిర్యాదును తిరస్కరించారు. అనంతరం సీఐ సత్యనారాయణ వారి వద్ద నుంచి స్వీకరిస్తున్నట్లు తెలిపారు సోమవారం నిందితులను పిలిపించి విచారణ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు.
వైఎస్సార్సీపీ వర్గీయుల దాడిలో టీడీపీ కార్యకర్తలకు గాయాలు: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి ఎస్సీ కాలనీలో వైఎస్సార్సీపీ - టీడీపీ వర్గీయులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో టీడీపీ వర్గీయులపై వైఎస్సార్సీపీ వర్గీయులు గొడ్డళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 10 మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు, గుంటూరులోని ఆసుపత్రులకు తరలించారు. కాలనీకి చెందిన 30 కుటుంబాలు ఇటీవల వైఎస్సార్సీపీను వీడి టీడీపీలో చేరాయి. అప్పటి నుంచి పార్టీ మారిన వర్గం వారంతా వైఎస్సార్సీపీ వర్గీయులకు దూరంగా ఉంటున్నారు.
తమను కాదని పార్టీ మారారనే నెపంతో కక్ష పెంచుకుని.. తమపై దాడికి తెగబడ్డారని టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. గొడ్డళ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని టీడీపీ వర్గీయులు తెలిపారు. దాడిని ప్రతిఘటించే సమయంలో వైఎస్సార్సీపీకు చెందిన పలువురికి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. గ్రామంలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
Petrol Attack on Couple: దారుణం.. మద్యం తాగొద్దన్నందుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు