Annamaya reservoir flood victims: అన్నమయ్య జలాశయం సృష్టించిన జలప్రళయంలో కొట్టుకుపోయిన ఇళ్లు, మృతి చెందిన కుటుంబ సభ్యుల ఘోష.. ఏడాది గడిచినా ఇంకా కళ్లముందే మెదలుతూనే ఉన్నాయి. ఆపన్నహస్తం అందించాల్సిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి.. పట్టించుకోలేదని రాజంపేట మండలంలోని ఎగువ మందపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కోసమే అన్నమయ్య డ్యాం గేట్లు ఎత్తకుండా ఆలస్యం చేసి మనుషుల ప్రాణాలు తీశారని.. పరామర్శకు వచ్చిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ వద్ద వారు ఆక్రోశం వెలిబుచ్చారు.
గతేడాది నవంబర్ 19న అన్నమయ్య జలాశయం మట్టికట్ట తెగి అనేక గ్రామాలు నేలమట్టమయ్యాయి. 36 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ప్రమాదం జరిగి సరిగ్గా ఏడాది గడిచిన సందర్భంగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. రాజంపేట మండలం ఎగువమందపల్లె, పులపుత్తూరు గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్థులు, యువకులు, మహిళలతో మాట్లాడి వారి సమస్యలు విన్నారు. ఏడాది గడిచినా తమ జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎగువమందపల్లె గ్రామస్థులు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. వప్రభుత్వం నుంచి సాయం తూతూ మంత్రంగానే అందిందని చెప్పారు.
ఇసుక అమ్ముకోవాడనికే వరద పోటెత్తినా అన్నమయ్య డ్యాం గేట్లు ఎత్తకుండా చేసి ప్రజల ప్రాణాలు తీశారని మహిళలు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలో వేటినీ ప్రభుత్వం నెరవేర్చలేదన్న స్థానికులు.. ఆ విలయంలో తామూ చనిపోయి ఉంటే ఇప్పుడీ కష్టాలను భరించాల్సిన పనిలేకుండా పోయేదంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు గ్రామాల్లో ప్రజల బాధలు విన్న జనసేన నేత నాదెండ్ల మనోహర్.. ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏడాది పూర్తయినా ముఖ్యమంత్రి సొంతజిల్లాలో వరద బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.