CM Chandrababu Speech in AP Assembly : 'కన్న తల్లి శీలాన్ని శంకించే వారు మనుషులా, పశువులా? తల్లి వ్యక్తిత్వాన్నే హననం చేసేవారికి మనం ఒక లెక్కా? కన్న తల్లిపైనా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే ఏమనుకోవాలి? గత ఐదు సంవత్సరాలల్లో ఏపీలో సోషల్ మీడియా సైకోలను తయారు చేశారు' అని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం, అప్పులపై అసెంబ్లీలో శుక్రవారం చంద్రబాబు ప్రసంగిస్తూ ఎన్డీఏ కూటమిలోని నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ అసభ్య పోస్టులు పెట్టరని తెలిపారు. ఒకవేళ పెడితే వారినీ శిక్షిస్తాం స్పష్టం చేశారు. ఆడబిడ్డలు గౌరవంగా బతికేలా చేస్తామని, రాబోయే రోజుల్లో ఏ ఆడబిడ్డా అవమానపడడానికి వీల్లేదని, చట్టానికి పదును పెట్టి కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు.
రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం : గత ఐదు సంవత్సరాలల్లో అప్పులు తెచ్చినా మూలధన వ్యయం చేయలేదని, ఏపీలోని రహదారులన్నీ గుంతలు పడ్డాయని, వీటికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని సీఎం ఆరోపించారు. ఏపీని అప్పులు తీర్చలేక ఐపీ పెట్టిన వ్యక్తిలా మార్చేశారని, పొలంలోకి అడవి పందులు వస్తే అవి తిన్నంత తిని, మిగతా పంటను నాశనం చేసి పోతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత పాలకులు ఇలానే వ్యవహరించారని, పెట్టుబడులు పెట్టేవారిని తరిమేశారని, ఇది కోపంతోనో ఆవేశంతోనో అనడం లేదని, బాధతో మాట్లాడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అప్పులు, పాపాలు, నేరాలే రాష్ట్రానికి శాపంగా మారాయని, రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని అనుకోవడం లేదని అన్నారు. ఒక్కో ఇటుకా పేర్చుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూ కేంద్రం సహకారంతో ముందుకెళుతున్నామని చంద్రబాబు వివరించారు.
రాష్ట్రం అప్పు 9.74 లక్షల కోట్లు - ఎవరైనా కాదంటే రండి తేల్చుతా : సీఎం చంద్రబాబు
మాపై బాధ్యత ఉంది : రాజకీయాల్లో అవినీతి చూసి ఉంటామని, కానీ అక్రమాలు, అవినీతి చేయడానికే రాజకీయాల్లోకి వచ్చిన వారిని చూస్తున్నామని చంద్రబాబు అన్నారు. టీడీపీ స్థాపించి ఇప్పటికి 45 సంవత్సరాలు అయిందని, తమకు టీవీ, పేపర్లు లేవని, కానీ, వారు అధికారంతో అవన్నీ ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. మద్యం ఆదాయాన్ని పూచీకత్తుగా చూపి రూ.25వేల కోట్ల అప్పులు తెచ్చారని, 2019కి ముందు మంత్రిగా ఉన్న నారా లోకేశ్ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని, 24 వేల కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు వేయించారని తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.4,500 కోట్లతో 30వేల పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో జల్‌జీవన్ మిషన్‌ను అస్తవ్యస్తం చేశారని, ప్రయోగాలతో విద్యావ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. ఆంగ్ల మాధ్యమాన్ని వారే ప్రవేశపెట్టినట్లు అంతకుముందు లేనట్లు ప్రవర్తించారని అన్నారు. ఎవరైనా మాట్లాడితే వ్యతిరేకులుగా చిత్రీకరించారని, రాజకీయ ముసుగులో నేరాలు చేయాలనుకునే వారి ముసుగు తొలగిస్తామని హెచ్చరించారు. సభకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాకపోవచ్చని, కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు.
సూపర్ సిక్స్‌తో పాటు మరిన్ని పథకాలు అమలుచేస్తాం : దీపం-2 కింద సిలిండర్ డబ్బులు లబ్ధిదారులకు నేరుగా అందించే విధానాన్ని త్వరలో తీసుకొస్తామని, దీనిపై కేంద్రంతో మాట్లాడుతున్నామని తెలిపారు. రైల్వేజోన్‌కు భూమి కేటాయించామని వెల్లడించారు. త్వరలో ప్రధాని మోదీ భూమిపూజ చేస్తారని, డిసెంబరులో లక్ష ఇళ్లలో గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని, ఇల్లులేని పేదలు ఎవ్వరూ లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. త్వరలో పర్యాటక పాలసీ తీసుకొస్తామని, గోదావరి-కృష్ణా-పెన్నా అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరవు ఉండదని తెలిపారు. 150 రోజుల్లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.10వేలకు పెంచామని, వేద విద్య అభ్యసించిన వారికి రూ.3వేల భృతి అందిస్తున్నామని, రైతులకు చెల్లించాల్సిన రూ.1,670 కోట్ల బకాయిలు చెల్లించామని అన్నారు. సూపర్‌సిక్స్ హామీలను పూర్తిగా అమలు చేయడమే కాకుండా అదనంగా మరిన్ని పథకాలు అమలు చేస్తామని సీఎం వెల్లడించారు.
సాక్షికి కోట్లు ఇచ్చుకున్నారు : సొంత పత్రిక సాక్షికి ప్రకటనల రూపంలో రూ.400 కోట్లు ఇచ్చుకున్నారని, ప్రజాధనంతో వాలంటీర్ల ద్వారా ఆ పత్రికను కొనిపించేలా ఆదేశాలు ఇచ్చుకున్నారని తెలిపారు. రూ.430 కోట్లతో రుషికొండపై ప్యాలెస్ నిర్మించుకున్నారని, ఆ భవనాలు చూస్తే కళ్లు తిరిగాయని అన్నారు. ప్రభుత్వ ధనంతో ప్యాలెస్‌లు కడతారా? సిగ్గూ ఎగ్గూ లేకుండా కుటుంబసభ్యులకు ప్యాలెస్‌లు కుట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, కోర్టులను మభ్యపెట్టి రూ.కోట్లు కుమ్మరించి కట్టారని ఆరోపించారు. కానీ, దానిలోకి వెళ్లలేకపోయారని అన్నారు. సర్వేరాళ్లపై రూ.750 కోట్లతో బొమ్మలు వేయించుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
'రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉంది - ఐదేళ్లూ అడవి పందుల తరహాలో మేశారు'
"అన్నీ కలిపితే రాష్ట్ర అప్పులు రూ.9,74,556 కోట్లు. ఇది అబద్ధం అని ఎవరు వచ్చినా లెక్కలు చూపించి, గుంజీలు తీయిస్తా. 2014-19 మధ్య 6 పైసలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేశాం. ఇవి బోర్డుకే వెళ్లేవి. కానీ, గత ప్రభుత్వం రూపాయికి పెంచి, దాన్ని తీసేసుకుంది. తాగునీటి పన్ను లీటరుకు రూ.40 నుంచి రూ.120కి పెంచారు. ఆర్థికలోటును రూ.35,440 కోట్ల నుంచి రూ.59,995 కోట్లు చేశారు. అప్పులు, ఖర్చులు పెరిగి ప్రజల ఆదాయం తగ్గింది. తలసరి వినియోగం 9 శాతం నుంచి 2 శాతానికి తగ్గింది. వృద్ధిరేటు 13.5 శాతం మేము సాధిస్తే దాన్ని 10.6 శాతానికి దిగజార్చారు. 3 శాతం వృద్ధిరేటు అంటే రూ.6.94 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోతుంది. తలసరి ఆదాయంలో ఏపీ, తెలంగాణ మధ్య 2018-19 నాటికి రూ.55వేల వ్యత్యాసం ఉంటే 2023-24 నాటికి రూ.1.14లక్షలకు చేరింది. వృద్ధిరేటు లేదు. అప్పులు పెరిగాయి. బటన్లు నొక్కేందుకు అప్పులు తెచ్చారు. కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్రం ఏమయ్యేదో.. ఉపాధి మార్గాలు పెంచేలా ముందుకెళుతున్నాం. రూ.4వేలు సామాజిక పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే." - సీఎం చంద్రబాబు నాయుడు
టెర్రరిజంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి : ప్రజల కోసం పని చేయాల్సిన బాధ్యత పాలకులుగా తమపై ఉందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వంద శాతం నిలబెడతామని హామీ ఇచ్చారు. 2014-19లో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు కొరత ఉంటే అధిగమించి మిగులు విద్యుత్తు సాధించామని, ఐదు సంవత్సరాలల్లో ఒక్కసారీ విద్యుత్తు ఛార్జీలు పెంచలేదని. కానీ, 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి విధ్వంసం చేశారని మండిపడ్డారు. ఈ విధ్వంసాన్ని అర్థం చేసుకోవడానికి నాలుగైదు నెలలు పట్టిందని. రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టం కంటే గత ఐదేళ్లలోనే ఎక్కువ జరిగిందని అన్నారు. గత ప్రభుత్వ టెర్రరిజంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని, రాష్ట్రంలోని పరిశ్రమలు తరలిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.1.29లక్షల కోట్లు విద్యుత్తు రంగంలో నష్టం వచ్చిందని తెలిపారు.
వారి పేర్లపై మార్చుకున్నారు : విద్యుత్తు తీసుకోకుండానే రూ.9 వేల కోట్లు చెల్లించారని, తప్పుడు నిర్ణయాలతో విద్యుత్తు రంగాన్ని నిర్వీర్యం చేశారని అన్నారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఆధారపడిన ఇసుకను దోచుకున్నారని తెలిపారు. మద్యం తయారు చేసే కంపెనీలను బెదిరించి లాక్కుని సొంత బ్రాండ్లు తయారు చేశారని, తాడేపల్లి ప్యాలెస్‌కు కలెక్షన్ సొమ్ము వెళ్లిందని తెలిపారు. భూములు కబ్జా చేశారని, భూములను 22ఏ కింద చేర్పించి, ఆ తర్వాత వారి పేర్లపై మార్చుకున్నారని ఆరోపించారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను పిచ్చివాడిని చేశారని, నడిరోడ్డుపై పడేసి చనిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.