RALLY FOR THREE CAPITALS : రాష్ట్రంలో మూడు రాజధానులకు మద్దతుగా పలువురు నాయకులు.. విద్యార్థులు, మహిళలతో కలిసి ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. 'ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు' అంటూ నినాదాలు చేశారు.
మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మూడు రాజధానులకు మద్దతుగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని టీ కూడలిలో కళాశాల విద్యార్థిని, విద్యార్థులతో మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రదర్శన ఏర్పాటు చేసి మూడు రాజధానులు ముద్దని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని.. చంద్రబాబు నాయుడు తన స్వార్థం, స్థిరాస్తి వ్యాపారం కోసం అమరావతి రాజధాని అంటున్నారని మంత్రి విమర్శించారు.
తిరుపతిలో విద్యార్థుల ప్రదర్శన: తిరుపతి జిల్లా నాయుడుపేట గాంధీ మందిరం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకూ వైకాపా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన విద్యార్థులు, పొదుపు మహిళలు ప్రదర్శన నిర్వహించారు. వికేంద్రీకరణకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు.
కర్నూలులో మానవహారం: కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నగరంలోని రాజ్ విహార్ కూడలి వద్ద హైకోర్టు సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులచే మానవహారం నిర్వహించారు. వెనుకబడిన రాయలసీమకు హైకోర్టు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని వారు కోరారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయంలో అడ్డుకుంటున్న రాజకీయ పార్టీలను తరిమికొడతామని వారు హెచ్చరించారు. ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హాఫీజ్ ఖాన్, ఎంపీ సంజీవ్ కుమార్, పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: