అనంతపురం జిల్లా నార్పలకు చెందిన సతీశ్ జీవితంపై విరక్తి చెంది ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనంత గ్రామీణం తాటిచెర్ల సమీపంలోని రైలు పట్టాలపై పడుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తన వాట్సాప్ ద్వారా మిత్రులకు పంపాడు. పట్టాలపై ఉన్నానని.. ప్రాణాలు తీసుకుంటున్నట్లు తెలిపాడు. అప్రమత్తమైన మిత్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు 100, 112 నంబర్లకు ఫోన్‌చేసి విషయం చెప్పారు. అక్కడి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సతీశ్ ఉన్న ప్రదేశాన్ని కనుగొన్నారు. ఈ విషయాన్ని అనంత రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డికి చేరవేశారు. ఒకవైపు ఆత్మహత్యకు సిద్ధమైన యువకుడితో ఫోన్లో మాట్లాడుతూ కౌన్సిలింగ్ చేస్తూనే.. మరోవైపు సిబ్బందితో కలిసి సీఐ సదరు రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి అతన్ని కాపాడారు.
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని ఓ ఎన్జీఓలో పని చేస్తున్న సతీశ్.. ఇటీవలే సొంతూరికి వచ్చాడు. తనకు మోసం జరిగిందని, దీంతో జీవితంపై విరక్తి చెంది ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులకు చెప్పాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తిని.. సమయస్ఫూర్తితో వ్యవహరించి కాపాడిన పోలీసులకు ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: కలిసికట్టుగా నగరాభివృద్ధికి కృషి చేద్దాం: మేయర్ వసీం