వ్యర్థం అనే మాటకు తన కళతో అద్భుత అర్థం సృష్టిస్తున్నారు బెంగుళూరుకు చెందిన తెలుగు యువ ఇంజనీర్ ఎంఆర్ శ్రీనివాసులు. పరిశోధన, నిర్మాణ మెళకువలు సమాహారంతో అద్భుత కట్టడాలు రూపొందించారు. సాఫ్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే... ఖాళీ సమయంలో అభిరుచికి అనుగుణంగా విభిన్న సూక్ష్మ రూపకాలను రూపొందిస్తున్నారు.
అనంతపూరం జిల్లా ధర్మవరానికి చెందిన శ్రీనివాసులు ఉద్యోగ రీత్యా బెంగళూరులో నివసిస్తున్నారు. శ్రీనివాసులు తండ్రి ధర్మవరంలో పట్టు చీరల వ్యాపారం చేసేవారు. చిన్నతనంలో పాఠశాల ముగిసిన తర్వాత నాన్న దుకాణానికి వెళ్లే శ్రీనివాసుల్ని అక్కడ పట్టుచీరల మీద ఉన్న డిజైన్లు, కళారూపాలు ఆకర్షించాయి. చేతి కళలపై ఆసక్తి పెంచాయి. అది గమనించిన ఉపాధ్యాయులు చిత్రలేఖనంలో శ్రీనివాసులుకి శిక్షణ ఇచ్చారు.
ఇంటర్లో చేరాక శ్రీనివాసులు సొంతంగా సుద్దముక్క, మట్టిపై శిల్పాలు చెక్కడం సాధన చేశారు. ఇంట్లో ఉన్న పెళ్లి పత్రికల్ని సేకరించి సూక్ష్మ కళా రూపాలు చేసేవారు. ఇంటర్ అయ్యాక ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చేరాలని ఆసక్తిగా ఉండేది. తల్లిదండ్రుల సలహాతో కంప్యూటర్ సైన్స్ లో చేరారు. తన మనసంతా ఆర్కిటెక్చర్ మీదే ఉండేది. అందుకు అనుగుణంగా ఖాళీ సమయాల్లో వృథా వస్తువులతో విభిన్న కళాకృతులు మలిచేవారు.
స్నేహితుల దగ్గర నుంచి సేకరించిన ఖాళీ రీఫిల్స్ తో ఏమైనా చేయాలని శ్రీనివాసులు నిర్ణయించుకున్నారు. ఆలా ఈఫిల్ టవర్, చార్మినార్, లండన్ బిగ్- బెన్ క్లాక్ నిర్మాణం చేశారు. తన దగ్గర ఉన్న ఖాళీ పెన్ రీఫిల్స్ అయిపోవడంతో స్థానిక కళాశాలల్లో రీఫిల్స్ సేకరించాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరులోని పలు కళశాలలకు వెళ్లి.. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. వారి దగ్గర ఉన్న ఖాళీ రీఫిల్స్ సేకరించాడు. ఆలా 8500 రీఫిల్స్ సేకరించి...10 నిర్మాణాలు చేపట్టారు. అమృత్ సర్, ఛార్మినార్ లాంటి కట్టడాలకు సూక్ష్మ రూపమిచ్చి ఔరా అనిపించుకున్నారు.
శ్రీనివాసులు సూక్ష్మ కళలోనే కాకుండ పెయింటింగ్స్, భరతనాట్యం, కూచిపూడి, యక్షగానం కూడా తెలుసు. చాక్ పీస్ లతో శిల్పాలు చేయడంలో ప్రావీణ్యం సంపాదించారు. తన ప్రతిభకు గుర్తింపుగా ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్, యూనిక్ వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ అఫ్ రికార్డ్స్, ఆర్ హెచ్ ఆర్ వరల్డ్(యు కె) వరల్డ్ రికార్డు, యూఆర్ఎఫ్ గ్లోబల్ అవార్డు, హ్యూమానిటరియాన్ ఎక్సలెన్సు అవార్డు, నేషనల్ ప్రైడ్ అవార్డు, డా.బీఆర్ అంబేడ్కర్ సేవాపురస్కార్, నేషనల్ యూత్ ఐకాన్ అవార్డు 2019 మొదలైన అవార్డులు సొతం చేసుకున్నారు.
ఇదీ చదవండి: రాజ్యసభ: విజయసాయికి అడ్డు తగిలిన కనకమేడల