YCP Activists Attack Eenadu and ETV Reporters: అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. సాధికార సభ జరుగుతుండగా మధ్యలోనే జనం వెళ్లిపోతున్న ఫొటోలు తీస్తున్నారన్న అక్కసుతో ఈనాడు ఫొటోగ్రాఫర్, ఈటీవీ, న్యూస్‌టుడే కంట్రిబ్యూటర్లపై 150మందికిపైగా వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఈనాడు ఫొటోగ్రాఫర్ సంపత్, న్యూస్‌టుడే విలేకరులు ఎర్రిస్వామి, భీమప్ప, ఈటీవీ విలేకరి మంజునాథ్ గాయపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు ఆపే ప్రయత్నం చేయకుండా చోద్యం చూశారు. ఈటీవీ రిపోర్టర్ ఉరవకొండ గ్రామీణ సీఐ ప్రవీణ్‌కుమార్‌కు ఫోన్‌లో దాడి గురించి సమాచారం ఇచ్చినా సకాలంలో స్పందించలేదు.
కత్తులతో వైఎస్సార్సీపీ నేతల స్వైర విహారం - ఒకరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం
జిల్లాలోని ఉరవకొండ పాతబస్టాండు సమీపంలో ఆదివారం సామాజిక సాధికారసభ ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకులు మాట్లాడుతుండగానే సగం మందికిపైగా జనం వెళ్లిపోయారు. విలేకరులు ఆ ఫొటోలు తీస్తుండగా కొందరు వైసీపీ కార్యకర్తలు వచ్చి ఈనాడు ఫొటోగ్రాఫర్ సంపత్‌పై దాడి చేశారు. చొక్కా పట్టుకుని కెమెరా లాక్కునేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకోబోయిన ఎర్రిస్వామిపై కూడా దాడిచేశారు. పత్రికలో రాయలేని భాషలో దూషించారు. అడ్డొచ్చిన భీమప్పపైనా దాడికి తెగబడ్డారు.
పక్కనే ఉన్నా పట్టించుకోని పోలీసులు: ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఈటీవీ విలేకరి మంజునాథ్‌ను కింద పడేసికొట్టారు. వైసీపీ కార్యకర్తల నుంచి తప్పించుకోవడానికి ఈనాడు, ఈటీవీ, న్యూస్‌టుడే ప్రతినిధులు పరుగులు తీశారు. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కి తప్పించుకున్నారు. వైసీపీ దాష్టీకాలు పెచ్చుమీరాయి. బరితెగించిన ఆ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. సాధికార సభ జరుగుతుండగానే మధ్యలోనే జనం వెళ్లిపోతున్న ఫొటోలు తీస్తున్నారన్న అక్కసుతో ఈనాడు- ఈటీవీ ప్రతినిధులపై దాడులకు పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు ఆపే ప్రయత్నం చేయకుండా చోద్యం చూశారు.
YSRCP Leaders Attack on Pregnant: వైసీపీ నేతల అరాచకం.. 'జగనన్న సురక్ష'లో గర్భిణిపై దాడి
వైసీపీ నేత అక్రమాలపై కథనాలు రాశారనే దాడి: ఉరవకొండలో వైసీపీ నేతల అవినీతి, భూ దందాలు, అక్రమాలు, ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈనాడు విలేకరి ఎర్రిస్వామి ఇటీవల వరుస కథనాలు రాశారు. ఈ వ్యవహారంపై వైసీపీ ముఖ్య నాయకుడు, ఆయన కుమారుడు విలేకరులపై కక్ష పెంచుకున్నారు. జాగ్రత్తగా ఉండాలంటూ పలుమార్లు హెచ్చరించారు. ఇప్పుడు అదును చూసి ఎర్రిస్వామి లక్ష్యంగానే దాడికి పాల్పడ్డారు. వైసీపీ ముఖ్యనాయకుడి గ్రామానికి చెందిన వాలంటీర్లు, స్థానిక నాయకులను మోహరింపజేసి దాడి చేశారు. దాడిపై ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు చేసినా తిరిగి ఆయనపైనే కేసులు పెట్టించేలా ప్రణాళిక వేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఎస్పీకి ఫిర్యాదు చేయగా బాధ్యులపై కేసు నమోదుచేయడంతో పాటు ఎర్రిస్వామి కుటుంబానికి రక్షణ కల్పించాలని ఉరవకొండ సీఐని ఆదేశించారు. ఈనాడు-ఈటీవీ విలేకర్లపై దాడిని తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఖండించారు.