సొంత పార్టీ నేతలు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ...అనంతపురం జిల్లా శింగనమల మండలం నిమరువకొమ్మలో వైకాపా కార్యకర్త సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. రాజకీయ కక్షతో తన పార్టీలోని కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారని బాధితుడు బండి శ్రీనివాసులు ఆరోపించారు. ఇందులో భాగంగానే గత 8 నెలల నుంచి నా కుటుంబాన్ని వేధించడంతోపాటు, తనపై అక్రమ కేసులు పెట్టించారని వాపోయారు. చంద్ర అనే వ్యక్తి తన భూమిలోనుంచి అధికారికంగా రస్తా లేకపోయినా... రస్తా ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. అతనికి వైపాకా నేత నగేశ్ అండదండలు ఉన్నాయని వాపోయారు.
సమస్యను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి విన్నవించనా...ఫలితం లేకుండా పోయిందని బాధితుడు వాపోయాడు. చంద్ర, నగేశ్ అనే వ్యక్తులనుంచి తన కుటుంబానికి ప్రాణాహాని ఉందని, .. న్యాయం చేయాలని కోరుతూ సెల్‌టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్, ఎస్సై ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడించటంతో అతను కిందికి దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.