నీటి కేటాయింపులపై ప్రతి ఏటా నిర్వహించే సాగునీటి సలహా మండలి సమావేశం అనంతపురంలో వాడివేడిగా సాగింది. ఐఏబీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆధ్వర్యంలో కలెక్టరేట్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రతి ఏటా అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు కడప, కర్నూలు జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరవుతారు. కానీ ఈసారి అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. మంత్రి శంకరనారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎప్పటిలానే అధికారులు సరైన లెక్కలతో రాకపోవడంపై ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..
హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా గత ఏడేళ్లుగా నీరు వస్తున్నా.. ఏ సంవత్సరంలో ఏ చెరువులకు ఎంత నీరు ఇచ్చారన్న లెక్కలు లేవని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే హెచ్ఎల్సీ ద్వారా కేటాయింపులు చేసిన వాటికి హంద్రీనీవా నుంచి కూడా కేటాయింపులు చేస్తున్నారని అన్నారు. మరోవైపు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ హెచ్ఎల్సీ ప్రారంభంలో ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలో 40కి పైగా చెరువులు ఉన్నాయని... అయితే కేవలం 4చెరువులకు మాత్రమే నీరు ఇస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు హెచ్ఎల్సీ కాలువ ఆధునీకరణ చేయకపోవడం వలన నీరు సమృద్ధిగా ఉన్నా తీసుకోలేని పరిస్థితి ఉందని.. దీని వలన ఎన్నో ప్రాంతాలు నష్టపోతున్నాయని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ...చిత్రావతి ముంపు ప్రాంతాల వారికి ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదన్నారు. మరో వారం పది రోజుల్లో ముంపునకు గురయ్యే అవకాశం ఉందని గుర్తు చేశారు.
కలెక్టర్ ఆగ్రహం..
నీటి కేటాయింపులపై అధికారుల వద్ద సరైన లెక్కలు లేకపోవడంపై జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నుంచి ఇన్ని రోజులుగా నీరు ఇస్తున్నా.. ఏ ప్రాంతానికి ఎంత ఇచ్చామన్న లెక్కలు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.
ప్రతి చెరువు నింపుతాం: మంత్రి
చివరగా మంత్రి శంకరనారాయణ జిల్లాలో ఈ ఏడాది సంవృద్ధిగా వర్షాలు కురవడమే కాకుండా హంద్రీనీవా, హెచ్చెల్సీల నుంచి నీరు బాగా వస్తుందన్నారు. హెచ్ఎల్సీ నుంచి 40టీఎంసీల మేర వస్తుందని... హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న చివరి చెరువులకు కూడా నీరు ఇస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన అన్ని అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తామని చివరకు కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి:
స్థిరంగా కొనసాగుతున్న ద్రోణి.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు