FLOOD EFFECT OF YOGI VEMANA DAM: కరవు తప్ప వరదలు తెలియని అనంతపురం జిల్లా గ్రామీణులను.. భారీ ప్రవాహాలు వణికించాయి. కర్ణాటకతో పాటు, కదిరి నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలతో ఒక్కసారిగా నదులన్నీ ఉప్పొంగాయి. గ్రామాల్లోకి వరదలు చొచ్చుకొచ్చి పంటలను తుడిచిపెట్టి ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.
ముదిగుబ్బ మండలంలోని యోగివేమన జలాశయం దిగువ గ్రామాల్లోని ప్రజల్లో ఇంకా వరద భయం వీడలేదు. కేవలం ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన యోగివేమన ప్రాజెక్టుకు.. మద్దిలేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో.. మూడు రోజుల్లోనే రెండున్నర టీఎంసీల వరద వచ్చింది. ప్రవాహ ఉద్ధృతితో ఏడు గేట్లు తెరవడంతో పోటెత్తిన వరద.. సమీప గ్రామాలను అతలాకుతలం చేసింది. ఇంతటి వరద ప్రవాహం తామెప్పుడూ చూడలేదని గ్రామస్థులు చెబుతున్నారు.
వరదల వల్ల దొరిగల్లు, మల్లేపల్లి వద్ద తక్కువ ఎత్తు కలిగిన వంతెనలు తెగిపోయాయి. కొద్దిరోజుల పాటు ముదిగుబ్బ మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు కూడా స్తంభించాయి. ప్రస్తుతం కాజ్ వే వద్ద మట్టి, రాళ్లు వేసి రాకపోకలను కొంతమేర పునరుద్ధరించారు. ఈ దారుల గుండా ఆటోలు, ఇతర వాహనాలు గ్రామాలకు రావటానికి నిరాకరిస్తుండటంతో.. సరుకులు, పంటలకు మందులు తెచ్చుకోటానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
దొరిగల్లు గ్రామానికి తాగునీరు అందించే సత్యసాయి పథకం పంపులు, పైపులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వారం రోజుల్లో పునరుద్ధరిస్తామన్న అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని గ్రామస్థులు అంటున్నారు. తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల వల్ల పాడైన రోడ్లను బాగుచేసి, మంచినీటి వ్యవస్థను పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
cheetah's wandering: అక్కడ చిరుత పులుల సంచారం.. భయాందోళనలో స్థానికులు