అనంతపురం జిల్లా ఉరవకొండలో సబ్సిడీ వేరుశనగ విత్తనాల అక్రమ నిల్వలపై విజిలెన్స్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. ఇందులో భాగంగా విజిలెన్స్ ఎస్పీ రామాంజనేయులు వ్యవసాయ శాఖ, జేడీ హబీబీ బాషా.... విడపనకల్ మండలం వెల్పమడుగు గ్రామంలో పర్యటించారు. అక్రమంగా విత్తనాలను నిల్వ ఉంచిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం గ్రామాల్లో విచారణ చేశారు. అదేవిధంగా ఉరవకొండలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో విత్తన వేరుశెనగ స్టాక్‌ను పరిశీలించారు. వెల్పమడుగు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 754 సబ్సిడీ విత్తనాల బస్తాలను ఇటీవలే స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
రైతులను మభ్యపెట్టి విత్తనాలను కొని కర్ణాటకకు తరలించేందుకు కొందరు వ్యాపారులు వీటిని కొన్నట్లు తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని కేసులు నమోదు చేశామని అవసరమైతే దళారులు వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా వేరుశెనగ విత్తన పంపిణీ నిలిపివేసినట్లు తెలిపారు. విత్తనం వెయ్యని రైతులకు ప్రత్యామ్న్యాయ విత్తనాలైన ఉలవలు, పెసలు, అలసందలు తదితర వాటిని పూర్తిగా ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 25 తేదీ తర్వాత ఎప్పుడైనా ప్రత్యామ్నాయ విత్తనాలను పంపిణీ చేస్తామన్నారు.