సొంత ఊరిలో బతికే దారిలేక.. అనంతపురం జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు వలసలు తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. పిల్లలను, పెద్దలను ఇళ్ల వద్దే వదిలి.. బతుకు వెతుక్కుంటూ వెళ్లే వారితో ...బెంగుళూరు, కొచ్చి నగరాల్లో అత్యంత ప్రమాదకరమైన పనులను చేయిస్తూ ఉంటారు. ఇరుకు గదులు, ఫుట్‌పాత్‌లే ఆవాసాలుగా చేసుకొని....రోజూ కూలీ చేస్తూ...కాస్తో కూస్తో తిని పిల్లల కోసం కష్టాలన్నీ వలస జీవులు ఓర్చుకుంటారు.
అలాంటి వలస బతుకులపై లాక్ డౌన్ పిడుగు పడింది. బతుకులను మరింత దుర్భరంగా మార్చేసింది. మేస్త్రీలు చేసిన పనికి కూలీ చెల్లించకుండా ముఖం చాటేశారు. పాడరాని పాట్లు పడ్డారు. నాలుగు మెతుకుల కోసం పరితపించి పోయారు. చివరకు వేల కిలో మీట్లరు నడిచి రాష్ట్రానికి తిరిగి వచ్చారు. క్వారంటైన్ కష్టాలనూ దాటుకొని అయినవాళ్ల చెంతకు చేరారు.
పట్టెడన్నం కరవై తప్పని పస్తులు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది వలస కూలీలు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు. ఇళ్లకు చేరి కలోగంజో తాగి బతుకుదామనుకున్న వలస కూలీల పరిస్థితి మరింత దారుణంగా మారింది. చేసేందుకు పని లేదు. తినేందుకు తిండి లేదు. రోజులు ఎలా నెట్టుకురావాలో అర్థం కాని పరిస్థితి.
ప్రభుత్వం ఇచ్చే రేషన్ ఏమాత్రం సరిపోని దుస్థితి. కొందరు వలస జీవులకు రేషన్ కార్డు లేక బియ్యం అందలేదు. అష్టకష్టాలు పడి తిరిగొచ్చిన తమను ఎవరూ ఆదుకోవటంలేదని వలస కూలీలు కన్నీరు పెడుతున్నారు.
అక్కరకు రాని ఉపాధి హామీ పథకం
వలసల నుంచి తిరిగొచ్చిన కూలీలకు చాలా మందికి సొంత గ్రామాల్లో ఉపాధి హామీ జాబ్ కార్డు లేకపోవటంతో పని దొరక్క సతమతమవుతున్నారు. మహానగరాల్లో కష్టపడుతూ డబ్బు సంపాదిస్తామనే ధైర్యంతో, వలస కూలీలు చాలామంది అధిక వడ్డీలకు అప్పులు చేసి మరీ సొంత ఊళ్లలో ఇళ్లు కట్టుకున్నారు.
లాక్ డౌన్‌తో పూట గడవటమే కష్టంగా మారి... వడ్డీలు కట్టలేకపోతున్నారు. ప్రభుత్వం తమకు పని చూపకపోతే మళ్లీ వలసబాట తప్పదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని నిరుపేద వలస కూలీల్లో చాలా మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని పరిస్థితి నెలకొంది. పిల్లలను గ్రామాల్లో వదిలి వలసవెళ్లిన తమకు అమ్మఒడి డబ్బులూ అందలేదని నిరుపేద తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: