సీఆర్‌పీసీ సెక్షన్ 107 , 145 ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారని సమాచారం ఉన్నప్పుడు ఆ వ్యక్తులు బాండ్ సమర్పించాలని బైండోవర్ చేసే అధికారాన్ని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్(తహసీల్దార్) కు ఆ సెక్షన్లు కల్పిస్తున్నాయని స్పష్టంచేసింది. సెక్షన్ 107 , 145 ప్రకారం పోలీసులు కేసులును నమోదు చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఈ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని.. ఆ విషయంపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలవుతున్నాయని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న ఎస్హెచ్వోలకు ఆ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.
ఓ వ్యక్తిపై పోలీసులు సెక్షన్ 107 కింద నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల ఈ మేరకు కీలక ఉత్తర్వులిచ్చారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు పోలీసులు తనపై సీఆర్‌పీసీ సెక్షన్ 107 కింద కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ బండి పరశురాముడు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా న్యాయమూర్తి పై విధంగా ఆదేశాలిచ్చారు.
ఇదీ చదవండి