Tension at Thadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. పెద్దపప్పూరు వద్ద పెన్నా నదిలో ఇసుక, మట్టి అక్రమంగా తరలిస్తున్నారని గత కొంతకాలంగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకుంటామని.. వాటిని తరలించే వాహనాలను తగులబెడతామని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇటీవలె హెచ్చరించారు. అన్నట్లుగానే నేడు నిరసనలకు ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్ద సుమారు 100 మంది పోలీసులు పహరా కాస్తున్నారు. ఇంటి చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన 8 మంది టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. తప్పించుకుని బయటకు వచ్చిన ఆయన్ను పోలీసులు తిరిగి ఇంట్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జేసీ నేలపై పడిపోయారు. పోలీసుల చర్యలను ఖండించిన జేసీ.. తన ఇంటి ముందే కుర్చీలో కూర్చొని నిరసన తెలిపారు. దీంతో కుర్చీతో సహా జేసీని బలవంతంగా తిరిగి లోపలికి తీసుకెళ్లేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. జేసీపై పోలీసుల చర్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు జేసీ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రకటనల వల్లే జేసీని అడ్డుకున్నామని పోలీసులు వెల్లడించారు.
టీడీపీ కౌన్సిలర్లను అడ్డుకున్న పోలీసులు: తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లను పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో విధులకు వెళ్లకుండా కౌన్సిలర్లను అడ్డగించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి మీదుగా కార్యాలయానికి వెళ్లాల్సి ఉండటంతో వారిని అక్కడికి వెళ్లకుండా దారిలోనే ఆపేసారు. ఈ నేపథ్యంలో పోలీసులు, కౌన్సిలర్లకు మధ్య వాగ్వాదం నెలకొంది.
ఇవీ చదవండి: