అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లిలో ఇళ్ల తొలగింపు ప్రక్రియలో అధికారుల అత్సుత్సాహం..ఒక బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. చిత్రావతి జలాశయం ముంపు గ్రామమైనందున ఖాళీ చేయాలంటూ అధికారులు జేసీబీ యంత్రాలతో రంగంలోకి దిగారు. పరిహారం కోసం ప్రశ్నించిన గ్రామస్థులతో ఆర్డీవో ఓ వైపు చర్చిస్తున్నారు. అర్హులందరికీ పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.
అంతలోనే ఇళ్ల కూల్చివేత మొదలైంది. ఓ ఇంటి గోడను ముందుకు కూల్చాల్సిన డ్రైవర్ వెనక్కి కూల్చడంతో గోడ శిథిలాలు నాగచైతన్య అనే బాలుడిపై పడ్డాయి. తలకు గాయాలయ్యాయి. పార్వతమ్మ అనే మహిళకు చేయి విరిగింది. అసలే ఆవేదనలో ఉన్న గ్రామస్థులు ఆగ్రహించారు. జేసీబీ అద్దాలు పగలగొట్టారు. వాహనాలపై రాళ్లు రువ్వేయత్నం చేశారు. ధర్మవరం ఆర్డీవో మధుసూదన్ బాలుడ్ని హుటాహుటిన బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై తెలుగుదేశం మండిపడింది. బతికుండగానే మనుషుల్ని సమాధి చేసే క్రూరమైన ఆలోచనలు వైకాపా సర్కార్‌కు ఎలా వస్తున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిలదీశారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని, మనుషులు ఉండగానే ఇళ్లను కూల్చడాన్ని ఏమనాలని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. బాధితులను మాజీ మంత్రి పరిటాల సునీత ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. రైతులకు పరిహారం ఇవ్వకుండానే ఖాళీ చేయించడం సరికాదన్నారు.
మర్రిమాకులపల్లిలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊర్లోకి చిత్రావతి జలాశయం నీరు వస్తుండటంతో భయం భయంగా గడుపుతున్నారు.
ఇదీ చదవండి : మర్రిమేకలపల్లిలో ఉద్రిక్తత... భారీగా పోలీసుల మోహరింపు