MLC Election Counting: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్య ఓట్లతోపాటు రెండో ప్రాధాన్య ఓట్లకూ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ప్రకారం ఏ అభ్యర్థికీ మెజార్టీ రానప్పుడు... రెండో ప్రాధాన్య ఓట్లే కీలకమవుతాయి. అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయిస్తాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌తో తెలుగుదేశానికి ముందస్తు అవగాహన ఉంది. దీనివల్ల వారికి సంబంధించిన ఓటర్ల రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎక్కువ శాతం తెలుగుదేశం అభ్యర్థులకే వెళ్లాయి. అయితే.. అంతగా సత్సంబంధాలు లేని బీజేపీ నుంచి కూడా.. రెండో ప్రాధాన్య ఓట్లు చాలావరకు తెలుగుదేశం పార్టీకి పడటం విశేషం.
స్వతంత్రులకు మొదటి ప్రాధాన్యం వేసినవారూ రెండో ప్రాధాన్యం విషయంలో తెలుగుదేశాన్నే ఎంచుకున్నారు. ప్రాంతాలకు అతీతంగా అన్నిచోట్లా ఇదే ధోరణి కనబడటం మరో ముఖ్యమైన అంశం. అలాగని గంపగుత్తుగా ద్వితీయ ప్రాధాన్య ఓట్లన్నీ తెలుగుదేశానికి మళ్లలేదు. పీడీఎఫ్ అభ్యర్థుల ద్వితీయ ప్రాధాన్య ఓట్లలో వైసీపీ అభ్యర్థులకు కూడా గణనీయంగానే బదిలీ అయ్యాయి. బీజేపీ నుంచి రెండో ప్రాధాన్య ఓట్లు కొంతమేర వైసీపీ అభ్యర్థులకు పడ్డాయి. అయితే ఈ బదిలీ ఏ స్థాయిలో జరిగిందన్నది విస్పష్ట లెక్కలు మాత్రం లేవు. ఎందుకంటే.. ద్వితీయ ప్రాధాన్య ఓట్లను పూర్తిగా లెక్కించకముందే తెలుగుదేశం అభ్యర్థుల విజయం ఖరారు కావడమే అందుకు కారణం.
ఉత్తరాంధ్రలో బీజేపీ అభ్యర్థి మాధవ్‌కు మొత్తం 10వేల 885 మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. మాధవ్‌కు మొదటి ప్రాధాన్యం ఇచ్చినవారిలో 3వేల 959 మంది రెండో ప్రాధాన్యంగా తెలుగుదేశం అభ్యర్థిని ఎంచుకోగా, 14వందల 14 మంది మాత్రమే వైసీపీ వైపు మొగ్గుచూపారు. పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు మొత్తం 35వేల 153 మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. ఆమెకు ఓట్లేసిన వారి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలో తెలుగుదేశం అభ్యర్థికి 6వేల 645, వైసీపీ అభ్యర్థికి 2వేల 25 ఓట్లు పడ్డాయి. అంటే.. రెండో ప్రాధాన్య ఓట్లలో వైసీపీ అభ్యర్థి కంటే తెలుగుదేశం అభ్యర్థికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ పడ్డాయి. అధికశాతం ఓట్లు మళ్లినా.. ఇందులో ఇంకో అంశమూ ఉంది. తెలుగుదేశం, పీడీఎఫ్ మధ్య అవగాహన ఉన్నప్పటికీ.. 2వేల 25 ఓట్లు వైసీపీకు పడటం విస్మరించలేని అంశం. ఇక తూర్పురాయలసీమలో బీజేపీ అభ్యర్థి దయాకర్‌రెడ్డికి మొత్తం 6వేల 314 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.
రెండో ప్రాధాన్యత ఓట్లలో తెలుగుదేశం అభ్యర్థికి 2 వేల 4 ఓట్లు, వైసీపీ అభ్యర్థికి వెయ్యి 51 ఓట్లు వెళ్లాయి. P.D.F అభ్యర్థి వెంకటేశ్వర్‌రెడ్డికి మొత్తం 38వేల ఒక్క మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా.. రెండో ప్రాధాన్యతా ఓట్లు తెలుగుదేశం అభ్యర్థికి 8వేల 355, వైసీపీ అభ్యర్థికి 2వేల 974 ఓట్లు వెళ్లాయి. పశ్చిమ రాయలసీమలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్రకు మొత్తం 7వేల 412 మొదటి ప్రాధాన్యతా ఓట్లు పడగా... రెండో ప్రాధాన్యతా ఓట్లలో తెలుగుదేశం అభ్యర్థికి 3వేల 312, వైసీపీ అభ్యర్థికి 12వందల 37 ఓట్లు వెళ్లాయి. పీడీఎఫ్ అభ్యర్థి నాగరాజుకు మొత్తం 18వేల 758 మొదటి ప్రాధాన్యతా ఓట్లు రాగా... ద్వితీయ ప్రాధాన్య ఓట్లలో తెలుగుదేశం అభ్యర్థికి 9వేల 886, వైసీపీ అభ్యర్థికి 3వేల 352 ఓట్లు వెళ్లాయి.
ఇవీ చదవండి: