TDP Votes Removing With Volunteers In Anantapur District: బీఎల్వోలు వైసీపీ నాయకులతో కుమ్మక్కై, వాలంటీర్ల సహకారంతో టీడీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించిన ఉదంతం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చింది. ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఓటర్ల జాబితా నుంచి టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కొందరు బీఎల్వోలు తొలగించారని నేతలు మండిపడ్డారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా కొందరు బీఎల్వోలు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను లక్ష్యంగా చేసుకుని తొలగింపు ప్రక్రియ కొనసాగించారు. విడపనకల్లు మండలం చీకలగురికి గ్రామంలో 13 మంది టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించిన విషయం తాజాగా బయటపడింది.
చీకలగురికిలోని 47, 48 బూత్‌ల్లో 13 ఓట్లు గల్లంతయ్యాయి. వీరంతా ఉపాధి నిమిత్తం తాత్కాలికంగా కర్ణాటకలోని బెంగళూరు, బళ్లారి, తమిళనాడులోని చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లినట్లు గుర్తించారు. వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, గ్రామంలోని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే ఓట్లను తొలగించారని నాయకుల పరిశీలనలో తేలింది. దీనిపై ఈ ఏడాది అక్టోబరులో ఎన్నికల సంఘానికి పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేశారు. వైసీపీ సానుభూతిపరులు 19 మంది చీకలగురికి గ్రామాన్ని వదిలి శాశ్వతంగా వెళ్లిపోయినా వారి పేర్లు ఓటర్ల జాబితాలో అలాగే ఉంచారని తెలిపారు. సమగ్ర విచారణ జరిపి వారంలోగా నివేదిక ఇవ్వాలని భారత ఎన్నికల సంఘం నవంబరు 3న రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
"కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశాల మేరకు విడపనకల్లు తహసీల్దార్ బ్రహ్మయ్య క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ఆయన ఇచ్చిన నివేదిక స్పష్టంగా లేదని, తప్పుదారి పట్టించారని ఎమ్మెల్యే కేశవ్ ఈనెల 7న కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం ఆర్డీవో రవీంద్ర విచారణ చేపట్టారు. తొలగించిన వారిలో కొందరు పెళ్లిచేసుకుని వెళ్లగా మరికొందరు ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లారని నివేదికలో తెలిపారు. అయితే ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించే ముందు సమాచారం ఇవ్వలేదని, తొలగింపు దరఖాస్తులో ఎలాంటి సంతకాలు చేయలేదని ఆర్డీవో రవీంద్రకు బాధితులు తెలిపారు. కక్షపూరితంగానే తొలగించారని ఆర్డీవోతో వాదనకు దిగారు. సమగ్ర విచారణ తరువాత పూర్తి నివేదిక కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు ఆర్డీవో తెలిపారు." -రవీంద్ర, గుంతకల్లు ఆర్డీవో
కూడేరు, విడపనకల్లు, బెళుగుప్ప మండలాల పరిధిలోని వైసీపీ నాయకులకు నియోజకవర్గం కేంద్రం ఉరవకొండలోనూ ఓట్లు ఉన్నాయి. వైసీపీ సానుభూతిపరులకు వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేస్తూ, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు పెద్దఎత్తున తొలగిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చీకలగురికి అక్రమాలపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఇవీ చదవండి