రాష్ట్రంలో తేదేపా పుంజుకుంటోందనే ఉద్దేశంతోనే తెదేపా నేతలపై వైకాపా దాడులు చేస్తోందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసి, అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తేదేపా మహిళ నాయకురాలు ప్రియాంకను పయ్యావుల కేశవ్ పరామర్శించారు.
రాజకీయాలతో సంబంధం లేని భువనేశ్వరిపై వైకాపా నేతలు చేసిన ఆరోపణలు జీర్ణించుకోలేక మహిళా నేతలు విమర్శిస్తే.. వారి ఇళ్ళపై పోలీసులు దాడులు చేసి, బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు న్యాయమని పయ్యావుల ప్రశ్నించారు. మహిళలు ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించడం సరికాదన్నారు. వైకాపా నేతలు ఆరోపణలు చేస్తే ఒకలా.. తెదేపా నేతలు ఆరోపణలు చేస్తే మరోలా చూస్తూ.. పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలనకు తెరలేపిందని ఆరోపించారు. తెదేపా నేతలను ఇబ్బందులకు గురి చేస్తే.. న్యాయపరంగానే పోరాడతామని స్పష్టం చేశారు. ఎలాంటి భయబ్రాంతులకు గురిచేసినా.. తెదేపా కార్యకర్తలు బెదిరిపోరని అన్నారు. వారందరికీ అధిష్టానం అండగా ఉంటుందని పయ్యావుల భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: TDP PROTEST: అనంతపురంలో తెదేపా నాయకులు, పోలీసుల మధ్య తోపులాట