రాష్ట్రంలో మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా అనంతపురంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కుమార్ను అదుపులోకి తీసుకుని, స్టేషన్ తరలించే క్రమంలో తెదేపా కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
పోలీసు జీపును తెదేపా కార్యకర్తలు అడ్డగించారు. పవన్ కుమార్ను రెండో పట్టణ పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరరం విడుదల చేశారు. ర్యాలీ నిర్వహణకు పోలీసులను అనుమతి కోరినా ఇవ్వలేదని జేసీ పవన్ చెప్పారు. వైకాపా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామనే భయంతోనే తమకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి కేసులు ఎన్ని బనాయించిన భయపడేది లేదన్నారు. అధికారపక్షానికి ఒకలా ప్రతిపక్షాలకు మరోలా పోలీసులు నిబంధనలు అమలు చేస్తున్నారని విమర్శించారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు : డీఎస్పీ
విపత్తు నిర్వహణ చట్టం అతిక్రమించినందు వల్లే తెదేపా నేత జేసీ పవన్ కుమార్ రెడ్డిని, మరికొందరిని అదుపులోకి తీసుకున్నామని అనంతపురం డీఎస్పీ వీరరాఘవ రెడ్డి తెలిపారు. జేసీ పవన్ తన అనుచరులతో కలిసి బైక్ ర్యాలీ చేపట్టే ప్రయత్నం చేశారన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : దూసుకొస్తున్న నివర్...ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు