TDP KALAVA: అనంతపురంలో టమాటా రైతుల బాధ ప్రభుత్వానికి పట్టడం లేదని తెదేపా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని కక్కలపల్లి టమాటా మార్కెట్ పరిసర ప్రాంతాలను తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్లు, శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. జిల్లాలో టమాటా పంటకు గిట్టుబాటు ధర లేక నేలపై పారబోస్తుంటే.. కనీసం ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటున్నామని చెబుతున్న జగన్.. దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలో రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి చేపడతామని.. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ సంగతి: ఈ ఏడాది టమాటా సాగుతో అనంతపురం జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్‌లో ధరలు లేకపోవడం.. నాణ్యత లేదంటూ వ్యాపారులు తిరస్కరించడంతో రైతులు ఎక్కువ శాతం పారబోశారు. జిల్లాలోని కక్కలపల్లి మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఎటూ చూసినా కుప్పలు కుప్పలుగా పడేసిన టమాటానే కనిపిస్తోంది. గత వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా దాదాపు వెయ్యి టన్నులకుపైగా సరకును పారబోసినట్లు అంచనా.
ఇవీ చదవండి: