Ex Minister Kalava Srinivasulu Selfie Video: తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు.. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి సవాల్ విసిరారు. అనంతపురం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధికి ఎవరు ఏం చేశారో ప్రతి వారం ప్రజలకు చెప్పుకుందామని రామచంద్రారెడ్డికి సవాల్ విసురుతూ.. సోమవారం సాయంత్రం తొలి సెల్ఫీ వీడియోను కాలవ విడుదల చేశారు. గుమ్మఘట్ట మండలం గోనబావి గ్రామం వద్ద నాలుగు సంవత్సరాలుగా నిలిచి పోయిన ప్రభుత్వ బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల భవనానికి సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు. టీడీపీ పాలనలో వెనుకబడిన గుమ్మఘట్ట మండలానికి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రూ.24 కోట్ల నిధులను ఈ భవనానికి మంజూరు చేశారని కాలవ గుర్తు చేశారు.
అప్పట్లోనే సగానికి పైగా నిర్మాణ పనులు జరిగాయని, తరువాత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిర్మాణం నిలిచిపోయిందన్నారు. ఫలితంగా గుమ్మఘట్టలోని తాత్కాలిక భవనంలోనే ఏళ్ల తరబడి అసౌకర్యాల నడుమ పేద బీసీ బాలికలు చదువులు కొనసాగిస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అసమర్థతకు ఆనవాలుగా బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల భవనం మొండిగోడలతో దర్శనమిస్తోందని కాలవ ఎద్దేవా చేశారు. గుమ్మగట్ట మండలం టీడీపీ నాయకులతో కలిసి బీసీ బాలికల గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. అక్కడి సౌకర్యాలపై బాలికలను అడిగి కాలవ తెలుసుకున్నారు. వైసీపీ అసమర్ధ పాలనతో బీసీ బాలికల విద్యార్థులు అసౌకర్యాల నడుమ విద్యను అభ్యసిస్తున్నట్లు కాలవ ఆందోళన వ్యక్తం చేశారు.
వినతీపత్రాలు ఇవ్వం.. మున్సిపాలిటీని ముట్టడిస్తాం: అంతే కాకుండా రాయదుర్గం మున్సిపల్ కార్యాలయం ముందు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు సోమవారం ధర్నా చేశారు. రాయదుర్గం పట్టణ ప్రజలకు వేసవిలో పది రోజులపాటు తాగునీరు సరఫరా ఆగిపోవడంతో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొన్నట్లు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. రాయదుర్గం పట్టణానికి తాగునీరు అందించే ప్రధాన పైపులైను పగిలిపోవడంతో నీటి సరఫరాగిపోయి.. పట్టణ ప్రజలు దాహార్తితో అల్లాడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పైప్ లైన్ మరమ్మత్తులో అనంతరం రంగు మారిన నీరు కుళాయిలకు సరఫరా చేయడంతో ఆందోళన వ్యక్తం చేశారు. రాయదుర్గం పట్టణంలో తాగునీరు అందించే ఫిల్టర్ పాయింట్లో పారిశుద్ధ్య చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు రోగాల బారిన పడ్డారని తెలిపారు. ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించాలని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డికి కాలవ శ్రీనివాసులు వినతిపత్రం అందించారు. భవిష్యత్తులో పట్టణ ప్రజలకు సక్రమంగా మంచినీరు అందించాలని.. లేకపోతే టీడీపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
- MP Avinash: అవినాష్ అరెస్ట్ తప్పదు.! దస్తగిరి వాంగ్మూలమే కాదు.. దర్యాప్తులో చాలా విషయాలు తేలాయి
- Sand Contractors: 'అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాం.. దయచేసి మా బిల్లులు చెల్లించండి'
- TDP chief Chandrababu letter to AP DGP: ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ.. బీటెక్ రవి భద్రత తొలగింపుపై అభ్యంతరం..