Students Prepared Food in Lepakshi Gurukul school : అనంతపురం జిల్లా లేపాక్షి జ్యోతీరావ్ ఫులే గురుకుల పాఠశాలలో.. గుత్తేదారు జీతాలు చెల్లించకపోవటంతో వంట మనుషులు సమ్మె బాట పట్టారు. మూడు నెలలుగా సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో మంగళవారం ఉదయం నుంచి విధులు బహిష్కరించారు. దీంతో విద్యార్థులే కూరగాయలు తరిగి, వంట పనులు చేసుకుంటూ సొంతంగా వంట తయారు చేసుకున్నారు.
ఇంత జరుగుతున్నా ఉపాధ్యాయులు పట్టించుకోలేదని, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థులకు న్యాయం చేయకపోతే పాఠశాల ముందు న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించాయి. విద్యార్థులు వంట పనులు చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
చదువుకోవాల్సిన విద్యార్థులు వంటగదుల్లో పనులు చేస్తున్నారు. ఈ ఘటపై ఉపాధ్యాయులు స్పందిచకపోవడం బాధాకరం. విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘం తరఫున కోరుతున్నాం. లేకపోతే పాఠశాల ఎదుట ఆందోళన చేస్తాం.
- అభిలాష్, విద్యార్థి సంఘం నాయకుడు
కూలీలుగా విద్యార్థులు..
building work with students: ఇటీవల అనంతపురం గ్రామీణం మన్నీల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేత ఉపాధ్యాయురాలు ఇంటి నిర్మాణ పనులు చేయించిన ఘటన వెలుగు చూసింది. అనంతపురంలోని ఆదర్శనగర్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న శివమ్మ సొంత ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఆదివారం నాడు విద్యార్థులను పిలిపించి ఇటుకలు, సిమెంటు బస్తాలు మోయించారు. అంతేకాదు.. నగరపాలక సంస్థకు చెందిన చెత్త సేకరించే తోపుడుబండ్లను సైతం వినియోగించుకున్నారు.
ఎవ్వరూ చూడరులే అనుకున్నారో.. చూసినా ఎవరేం చేస్తారులే అనుకున్నారో తెలియదుగానీ.. దర్జాగా తన సొంత పని చేయించుకున్నారు. కొందరు జనాలు చూసీ చూడనట్టు వదిలేసినా.. సెల్ ఫోన్ కన్ను మాత్రం కనిపెట్టింది. టీచరమ్మ ఇంటి వద్ద నడిచిన సినిమా మొత్తం షూట్ చేసింది. సదరు వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టింది. జనాలను దాటుకొని, అధికారుల వద్దకూ సైతం వెళ్లింది.
ఈ విషయమై జిల్లా విద్యా శాఖ అధికారి శామ్యూల్ని వివరణ కోరగా.. తనకూ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ డీఈవో మీనాక్షి ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించినట్లు చెప్పిన ఆయన.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి పనులు చేయడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు. సమయానికి భోజనం పెట్టి.. సరైన వసతులు కల్పించి విద్యార్థులు మంచిగా చదువుకునేలా ఉన్నతాధికారులు చూడాలని కోరుతున్నారు.
ఇదీచదవండి.