కొందరు విద్యార్థుల ప్రవర్తన సరిగా లేదని తమ తల్లిదండ్రులను తీసుకురావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చెప్పారు. కానీ విద్యార్థులు.. పోలీస్ స్టేషన్కు వెళ్లి గురువులపై ఫిర్యాదు చేసిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది.
ఉరవకొండ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థుల ప్రవర్తన సరిగా లేకపోవడంతో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వారి తల్లిదండ్రులను తీసుకురావాలని చెప్పారు. ఆ విద్యార్థులు తల్లిదండ్రులను తీసుకురాకుండా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. "మా టీచర్ మమ్మల్ని కొట్టారు. మాకు న్యాయం చేయాలి" అని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాఠశాలకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. విద్యార్థులు పాఠశాలలో చేస్తున్న పనులకు ఉపాధ్యాయులే కంటతడి పెట్టారు. తరగతి గదిలోకి మద్యం, సిగరెట్లు తెస్తున్నారని ప్రధాన ఉపాధ్యాయురాలు తెలిపారు. పాఠం చెప్పే సమయంలో ఉపాద్యాయులపై అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. పాఠశాలలో ఉన్న కుళాయిలు, ఫ్యాన్లు, కుర్చీలను కూడా ధ్వంసం చేశారని అన్నారు. అందుకే ఆ విద్యార్థులను బయటకు పంపామని స్పష్టం చేశారు.
తరగతి గదిలోకి మద్యం, సిగరెట్లు తెస్తున్నారు. ఉపాధ్యాయులను పాఠాలు చెప్పనీయకుండా అల్లరి చేస్తున్నారు. పుస్తకాలు విసిరేయడం, తోటి వారిని ఏడిపించడం ఇదే వారి పని. యూనిఫార్మ్ వేసుకోవాలని.. సరిగా హెయిర్ కటింగ్ చేసుకోవాలని పంపాము. నాడు- నేడులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్విచ్ బోర్డులు, ఫ్యాన్లను సైతం ధ్వంసం చేశారు. వారు చేస్తున్న పనులకు పాఠాలు చెప్పాలంటే టీచర్లే భయపడుతున్నారు. - రాజేశ్వరి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు
ఇదీ చూడండి: Talented Girl: ప్రసంగాలతో పాటు సంగీతంలో 'పల్లవి'స్తున్న ప్రతిభ