TDP Senior leader Kalva Srinivasulu Comments: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్రకు వస్తున్న అపూర్వ స్పందనను చూసి ఓర్వలేకే వైసీపీ మంత్రులు, ఆ పార్టీ నాయకులు విషం చిమ్ముతూ, చౌకబారు విమర్శలు చేస్తున్నారని మాజీమంత్రి, టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేశ్‌పై విమర్శలు చేయటం మాని, జాబ్ చార్ట్‌పై నిరుద్యోగులు, సంక్షేమ పథకాలపై బీసీ, ఎస్సీ, ఎస్టీలు, వ్యవసాయంపై రైతులు, మెడికోలు తదితర పలు వర్గాలకు చెందిన వారు లోకేశ్ పాదయాత్రలో లేవనెత్తుతున్న ప్రశ్నలకు చేతనైతే సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
సాధారణంగా ప్రతిపక్షాలు పాదయాత్రలు చేస్తున్నప్పుడు అధికార పార్టీ నాయకుల విమర్శలు సాధారణమని.. ఇలాంటి చౌకబార్ విమర్శలు చేయడం తగదన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా విఫలమై జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు.. తాము అలాంటి విమర్శలు చేయలేదన్నారు. ప్రస్తుతం లోకేష్ పాదయాత్రపై ప్రజలు అసహ్యించుకునేలా వైసీపీ నాయకుల విమర్శలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇటీవల ఐప్యాక్ జరిపిన సర్వేలో రాష్ట్రంలో 35 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా గెలవలేరని సర్వే తేల్చి చెప్పిందన్నారు.
అనంతరం 25 మంత్రులలో ఐదు మంది కూడా గెలవలేరని సర్వేలో వెళ్లడైందని, ఎన్నికలు జరిగే నాటికి ఇద్దరు మంత్రులు కూడా గెలవలేరన్నారు. 13 మంది మాజీ మంత్రుల్లో ఇద్దరు కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. ఐప్యాక్ సంస్థ జరిపిన సర్వేతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక వారంతా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో పరిశ్రమలు కానీ, ఆయా రంగాల్లో పెట్టుబడులు కానీ, ఒక మంచి రోడ్డు కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ రాలేదన్నారు.
అమరావతి రాజధాని ఆపేశారని.. పోలవరం ముందుకు సాగలేదని ధ్వజమెత్తారు. లోకేశ్ బాబు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మూడున్నర లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. పీఆర్ మంత్రిగా వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేసి అభివృద్ధికి బాటలు వేశారని కాలువ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి