కడప జిల్లా రాయచోటిలో ఏఐవైఎఫ్, ఐఎఫ్ఎస్, పీఆర్ఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. చదువుకునే విద్యార్థులపై ప్రతాపం ఏంటంటూ కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఎయిడెడ్ కళాశాలల విలీన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఒంగోలులో ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కును కాలరాయడం తగదని అనంతపురంలో విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. విద్యార్థులపై దాడులు చేయడం హేయమైన చర్య అని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర అన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని చిత్తూరు జిల్లా మదనపల్లెలో విద్యార్థులు ఆందోళన చేశారు.
నేను క్షేమంగానే ఉన్నా...
మరో వైపు అనంతపురంలో సోమవారం ఎస్ఎస్బిఎన్ కళాశాలలో గాయపడిన విద్యార్థిని జయలక్ష్మి... తాను క్షేమంగా ఉన్నట్లు వీడియో విడుదల చేసింది. ఎయిడెడ్ కళాశాలల విలీనాన్ని ఆపాలని ధర్నా చేస్తుండగా పోలీసులు చేసిన లాఠీఛార్జీలో తన తలకు గాయమైనట్లు వెల్లడించారు. ఆనంతరం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అనుబంధ కథనాలు.