అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎరజిన్నేపల్లి, హిందూపురం గ్రామీణ మండలం మలుగూరు గ్రామాల్లో మెడికల్ కళాశాల, ఆసుపత్రి నిర్మాణం కోసం డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి శంకర్ నారాయణ, కలెక్టర్ గంధం చంద్రుడు ఆధ్వర్యంలో స్థల పరిశీలన చేశారు. ఎరజిన్నేపల్లిలో గల సుమారు 61.6 ఎకరాల విస్తీర్ణం గల భూమిని ఆయన పరిశీలించారు.పెనుగొండ సబ్ కలెక్టర్ నిశాంతి కళాశాల నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని చూపించి మంత్రులకు వివరించారు.
అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో అన్ని విధాలుగా అభివృద్ధి చేపట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపడుతున్నారని తెలిపారు. కళాశాల ఆసుపత్రి నిర్మాణం కోసం మూడు ప్రాంతాల్లో స్థల పరిశీలన చేశామని.. స్థలాన్ని ఎంపిక చేసి ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తామన్నారు. ఆగస్టు నెలలోనే ఎంపికైన ప్రదేశంలో కళాశాల నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వీలైనంత తొందరగా పనులు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.