నైరుతి రుతుపవనాలు అనంతపురం జిల్లాపై పగబట్టినట్టున్నాయి. జిల్లాలోని కదిరి వైపు నుంచే రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు... ఈనెల తొలి వారంలో భారీ వర్షాలనిచ్చాయి. ఈ వర్షాలతో విత్తనం వేయటానికి భూమి సిద్ధం చేసుకున్న రైతులకు మళ్లీ చినుకు జాడ కనిపించలేదు. ఈసారి ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 6.70 లక్షల హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగువుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. సింహభాగం 4.5 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగుచేస్తారనే అంచనా ఉంది.
రైతులకు 1.80 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనం రాయితీపై ప్రభుత్వం పంపిణీ చేసింది. కొందరు రైతులు స్థానికంగా వేరుశనగ, కంది తదితర పంటల విత్తనం కొనుగోలు చేసి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు పది రోజులుగా మేఘాలు దట్టంగా రావటం, వెంటనే తీవ్రమైన గాలితో వర్షాన్నిచ్చే మేఘాలు వెళ్లిపోవటం జరుగుతోంది. జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసినా విత్తనం వేసేంతగా నేల పదును కాకపోవటంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది.
ఈనెల తొలి వారంలో పలు మండలాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. బుక్కురాయసంద్రం, ధర్మవరం మండలాల్లో వంద మిల్లీ మీటర్లు దాటి వర్షం కురిసింది. జిల్లాలో 63 మండలాలుండగా, 46 మండలాల్లో సాధారణం మించి వర్షపాతం నమోదైంది. 13 మండలాల్లో సాధారణ వర్షపాతం, ఒక మండలంలో తక్కువగా కురిసింది. మూడు మండలాల్లో చినుకు రాలలేదు. బొమ్మనహాల్, విడపనకల్లు, డి.హీరేహాల్ మండలాల్లో ఇప్పటి వరకు చినుకు రాలలేదు.
జూన్ నెలంతా కురవాల్సిన వర్షం మొత్తం పది రోజుల్లో కురవటంతో 19వ తేదీవరకు 93 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఈనెల మొత్తం 50 సెంటీమీటర్లు కురవాల్సి ఉండగా, ఇప్పటికే 93 సెంటీమీటర్లు కురిసింది. గతేడాది ఇదే సమయానికి 35 సెంటీమీటర్లు నమోదై, 30 శాతం లోటు వర్షపాతం రికార్డైంది. విత్తనం వేయటానికి భూమి సిద్ధం చేసుకున్న రైతులు రోజూ ఆకాశం వంక చూస్తూ నిట్టూరుస్తున్న పరిస్థితులు గ్రామాల్లో అన్నిచోట్లా నెలకొన్నాయి.
ఏటా రుతుపవనాలు ప్రవేశంతోనే మంచి వర్షాలు కురవటం, మళ్లీ చినుకు జాడలేకపోవటం జరుగుతోంది. చాలా మండలాల్లో పంట చివరి దశలో ఉన్నపుడు కుండపోత వానలతో చేతికిరావల్సిన పంట దక్కకుండా పోతున్న పరిస్థితి. అన్నదాతలకు ఇది సమస్యగా మారింది.
ఇదీ చదవండి:
Double murder: అనంతపురం ఆరవేడులో భూతగాదాలు.. అన్నదమ్ముల దారుణ హత్య