protest: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సర్పంచులు నిరసన (Sarpanches protest) వ్యక్తం చేశారు. పంచాయతీల ఖాతాల్లో ఉన్న 15వ ఆర్థికసంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని నిరసిస్తూ పలు జిల్లాలో ప్లకార్డులను ప్రదర్శించారు.
విశాఖ జిల్లాలో
విశాఖ జిల్లా రావికమతంలో ఆందోళన చేసి భిక్షాటన చేపట్టారు. మండల పరిషత్ కార్యాలయం వరకూ సర్పంచులు ర్యాలీగా వెళ్లారు. ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం చెప్పాపెట్టకుండా తీసుకోవడంపై అభ్యంతరం చెబుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎంపీడీవో రామచంద్రమూర్తికి వినతిపత్రం అందజేశారు. పంచాయతీ నిధులు తీసుకొని సర్పంచుల చేతులు కట్టేసిందని మేడివాడ, చినపాచిల, రావికమతం మహిళా సర్పంచులు లీలా, రామలక్ష్మి, మంగ వాపోయారు. ఆర్థిక సంఘం నిధులను వెంటనే పంచాయతీల ఖాతాల్లోకి జమా చేయాలని టి.అర్జాపురం, తట్టబంద, మర్రివలస సర్పంచులు మడగల అర్జున, గోకాడ చిన రమణ, పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాలో
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల సర్పంచులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బకాయి బిల్లులు చెల్లించకపోవడంతో ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచులకు సచివాలయ వ్యవస్థ నిర్వహణకు అవకాశం కల్పించాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియడం లేదని వాపోయారు. పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయడంలేదని, తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కోడూరు సర్పంచి మురళీమోహన్, దేమకేతేపల్లి సర్పంచి తిరుమలేష్‌గౌడ్, వీరాపురం సర్పంచి లక్ష్మీపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లాలో..
కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద కోనాయపాలెం సర్పంచి మార్కపూడి వెంకట్రావమ్మ, ఏటూరు సర్పంచి మామిడి వెంకటేశ్వరరావు, ముప్పాళ్ల సర్పంచి వీరమ్మ, వార్డు సభ్యులు నిరసన దీక్ష చేపట్టారు. గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించడానికి పైసా నిధులు లేవని, వెంటనే నిధులు జమచేయాలని డిమాండ్ చేశారు.
నిధులను తిరిగివ్వాలి: రామకృష్ణ
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల నుంచి తీసుకున్న రూ.3,450 కోట్లను తిరిగి వాటికే ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సీఎం జగన్‌కు బుధవారం రాసిన లేఖలో డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలలో సర్పంచులకు అధికారాలు ఇచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: padayatra: అమరావతి రైతులకు అపూర్వ స్వాగతం.. ఉత్సాహంతో సాగిన పాదయాత్ర