కుమార్తెను చూసేందుకు వెళ్తున్న ఓ మహిళను మృత్యువు బస్సు రూపంలో కబళించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం రెక్కమాను గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. రెక్కమానుకు చెందిన నాగులమ్మ(45) చెరువుముందరతండాలో ఉన్న కుమార్తెను చూసేందుకు మనుమరాలు రోజాతో కలిసి ద్విచక్ర వాహనంలో బయల్దేరారు. వీరి వాహనం వేగనిరోధకం వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ క్రమంలో వెనకనే వస్తున్న రాయచోటి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి నాగులమ్మ తలపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె తల నుజ్జునుజ్జుఅయి అక్కడికక్కడే మృతి చెందారు.
విషయం తెలుసుకున్న ఎస్సై ప్రమాద స్థలిని పరిశీలించి కుటుంబసభ్యులు, స్థానికులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని 108 వాహనంలో కదిరి ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన మండల కన్వీనర్ భూక్కే రత్నమ్మ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు