అనంతపురం జిల్లాలో నెలకొల్పిన కియా కార్ల తయారీ పరిశ్రమను ఏపీ నుంచి తమిళనాడు తరలించేందుకు.... సంస్థ ప్రతినిధులు తమిళ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఈనెల 6 రాయిటర్స్ సంస్థ వార్త వెలువరించింది. ఆ వార్త వెలువడిన వెంటనే అలాంటి ప్రతిపాదనేదీ లేదని ఏపీ ప్రభుత్వం, కియా సంస్థ బహిరంగ ప్రకటన చేశాయి. రాయిటర్స్ మాత్రం ఇప్పటికీ తమ వార్తకు కట్టుబడే ఉన్నట్లు పేర్కొంది. 1.1 బిలియన్ ప్లాంట్‌ను బయటకు తరలించేందుకు కియా చర్చలు జరుపుతోంది అన్న వార్తను తన ట్విటర్ హ్యాండిల్‌లో శనివారం రాత్రి 10 గంటల 59 నిమిషాలకు మరోసారి పోస్ట్ చేసింది. ఆ వార్తకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను రాత్రి 11 గంటల 13 నిమిషాలకు తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.
రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కథనానికి సంబంధించిన ఓ అసంబద్ధ ట్వీట్‌ను తొలగిస్తున్నట్లు శనివారం మధ్యాహ్నం ఒంటిగంట 26 నిమిషాలకు రాయిటర్స్ సంస్థ ట్విటర్‌లో పోస్ట్ చేయడం కొంత అయోమయానికి గురిచేసింది. అందులో వాడిన పదప్రయోగం కొంత అస్పష్టంగా ఉన్నందున... తాము ఇచ్చిన వార్త తప్పని తెలుసుకొని, డిలీట్ చేసిందని కొందరు ప్రచారం మొదలుపెట్టారు. వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. నిజానికి ఈనెల 6 నుంచి 8వ తేదీ మధ్య ఆ సంస్థ నుంచి 3 ట్వీట్లు వచ్చాయి.
6వ తేదీ ఉదయం 7 గంటలకు చేసిన తొలి ట్వీట్‌లో కియా బయటకి వెళ్లిపోవడానికి చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించారు. అదేరోజు రాత్రి 8 గంటల 06 నిమిషాలకు పోస్ట్ చేసిన మరో ట్వీట్‌లో కియా రాష్ట్రం నుంచి బయటకు పోతోందని చెప్పడానికి బదులు ఏపీకి పోతోందని పేర్కొన్నారు. ఈ తప్పును గ్రహించిన ఆ సంస్థ... శనివారం మధ్యాహ్నం ఒంటిగంట 26 నిమిషాల ఆ తప్పు ట్వీట్‌ను డిలీట్ చేస్తున్నట్లు పేర్కొంది. కియా ఆంధ్రప్రదేశ్ బయటకు వెళ్లడానికి చర్చలు జరుపుతోంది, రావడానికి కాదని స్పష్టత ఇచ్చింది. తమ ట్వీట్‌లో జరిగిన పొరపాటు గ్రహించి దాన్ని మాత్రమే తొలగించామని, కియా తరలింపుపై ఇచ్చిన కథనానికి కట్టుబడి ఉన్నామని రాయిటర్స్ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... సంక్షోభంలో చిక్కుకున్న విజయవాడ ఆటోనగర్