RAINS: రాష్ట్రంలో వరుణుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గం తడిసిముద్దైంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉరవకొండ వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జిపై ఆగిపోయింది. దీంతో గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో కురిసిన భారీ వర్షానికి సొల్లాపురం వంతెన పై నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను ట్రాక్టర్లో ఎక్కించి వంతెన దాటారు. ప్రమాదమని తెలిసినా ఆర్టీసీ బస్సు డ్రైవర్ సాహసం చేసి వంతెన దాటించడంతో.. బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరో ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుపోవడంతో తాళ్ల సహాయంతో బయటకు లాగారు.
శ్రీసత్యసాయి జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. పలు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుందుర్పి మండలంలో 102.4 మిల్లీమీటర్లు, కంబదూరు మండలంలో 65.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా … కంబదూరు చెరువుకు భారీగా వరదనీరు చేరింది. పెనుకొండ మండలంలో 98.4మిల్లీమీటర్లు.. రొద్దం మండలంలో 51.6మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అడదాకులపల్లి గ్రామ సర్పంచ్ టమోటా పంట వరదనీటిలో మునిగింది. రొద్దం పెద్ద చెరువు వరద నీటితో నిండుకోవడంతో.. మరువ నీటిలో పలువురు స్థానికులు ఫొటోలు దిగుతూ సందడి చేశారు.
ఇవీ చదవండి: