అనంతపురం జిల్లా తీవ్ర వర్షాభావంతో అల్లాడుతున్న నేపథ్యంలో... మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. నార్పల ప్రాంతంలో మంగళవారం ఒక్క రోజే 13సెంటీమీటర్ల వర్షం కురవగా.. బుధవారం రాత్రి వజ్రకరూరులో 9సెంమీల వర్షం నమోదైంది. జిల్లాలో ఈ సారి ఖరీఫ్ సీజన్ వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సెప్టెంబర్ 18 వరకు జిల్లాలో 209 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. ఇప్పటివరకు 26 శాతం వర్షపాతం లోటు నమోదైంది. గుత్తిలో 8సెంమీలు, బ్రహ్మసముద్రంలో 7 సెంటీమీటర్లు, శెట్టూరులో 4 సెంటీమీటర్లు, ధర్మవరంలో 10 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు నమోదవుతుండగా, పరిగి మండలంలో అత్యధిక లోటు కొనసాగుతోంది. పెద్దపప్పూరు, రాయదుర్గం, అగళి, రొద్దం లాంటి 10 మండలాల్లో 60 శాతానికి పైగా వర్షపాతం లోటు నమోదైంది.
ఇది కూడా చదవండి