Tragic incident in Anantapur district: ఏమైందో ఏమో సరైన కారణం తెలియదు కానీ.. ఓ తండ్రి అల్లారుముద్దుగా పెంచుకున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో శవాలు నీటిపై తేలియాడటం గమనించిన స్థానికులు.. పోలీసులకు సమచారం అందించడంతో హుటహుటినా ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలో బుక్కరాయసముద్రం రంగస్వామి నగర్‌లో నివాసముంటున్న రఫీ తన ఇద్దరు కుమారులతో కలిసి స్థానికంగా ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటనలో.. రఫీ తండ్రి (35), సోహైల్ చిన్నకుమారుడు (6), ఇమ్రాన్ పెద్ద కుమారుడు (9) మృతి చెందారు. ఈ సంఘటనతో బుక్కరాయసముద్రంలో ఒక్కసారిగా కలకలం రేపింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భార్యపై ఉన్న అనుమానంతోనే రఫీ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరగడానికి రెండు రోజుల (మార్చి 28) ముందు రఫీ తన భార్యతో గొడవపడినట్టు స్థానికులు చెప్తున్నారు. గొడవ జరిగిన అనంతరం మహమ్మద్ రఫీ.. ఇమ్రాన్ (9), సోహైల్ (6) ఇద్దరు కుమారులతో కలసి బయటకు వెళ్లినట్లు తెలిపారు. దీంతో మహమ్మద్ రఫీ, ఇద్దరు పిల్లలు కనిపించటంలేదంటూ బంధువులు అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తుండగా ఇవాళ బుక్కరాయసముద్రం చెరువులో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. లభ్యమైన మూడు మృతదేహాలను పరిశీలించగా.. మహమ్మద్ రఫీ వారి పిల్లలుగా తేలిందని పోలీసులు తెలిపారు.
గుంటూరు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య: మరోవైపు తమ ప్రేమను పెద్దలు కాదన్నారన్న కారణంతో ఓ ప్రేమ జంట రైలుకి ఎదురుగా నిల్చొని ఆత్మహత్య చేసుకున్న ఘటన.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శుద్దపల్లి రైల్వే గేట్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, తెనాలి రైల్వే పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. చేబ్రోలు మండలం సెలపాడు గ్రామానికి చెందిన త్రివేణి, శ్రీకాంత్ అనే ఇరువురు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఈ విషయం వారి వారి ఇళ్లలో తెలిసి పెద్దలు అంగీకరించలేదు. దీంతో సోమవారం త్రివేణి తెనాలిలో తాను చదువుతున్న కళాశాలకు వెళ్లి శ్రీకాంత్‌తో వెళ్లిపోతుండగా మరో యువతి త్రివేణి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో తల్లిదండ్రులు తెనాలి పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా గాలించి.. మంగళవారం చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. బుధవారం ఉదయం రైల్వే ట్రాక్‌పై రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో చేబ్రోలు పోలీసులు త్రివేణి తల్లిదండ్రులను అక్కడికి తీసుకెళ్లగా.. మృతురాలు వారి కుమార్తెనని గుర్తించారు. తెనాలి రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి