Pujas for Chandrababu Early Release in AP : చంద్రబాబు నాయుడు సురక్షితంగా బయటకు రావాలని కోరుతూ పలుచోట్ల టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ కోనసీమ జిల్లా పి గన్నవరంలో నియోజకవర్గ స్థాయిలో శెట్టిబలిజ సామాజిక వర్గీయులు నిరాహార దీక్ష చేపట్టారు. సర్వమత ప్రార్థన చేశారు. చంద్రబాబు నాయుడు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Pujas, Agitations for CBN Release : చంద్రబాబు త్వరగా విడుదల అవ్వాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని ప్రసిద్ధ గోలింగేశ్వర స్వామి ఆలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గోలింగేశ్వర స్వామి వారికి, కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని విగ్నేశ్వర స్వామితో పాటు పార్వతి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు పేరిట అర్చన చేయించి త్వరగా విడుదల అవ్వాలని ప్రత్యేక పూజలు చేశారు.
చంద్రబాబు కడిగిన ముత్యంలా జైలు నుంచి రావాలని కోరుతూ బాపట్ల జిల్లా చీరాల పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వివిధ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక వాసుదేవ విలాస్ కూడలిలో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేసారు. చంద్రబాబుకు ఆయురారోగ్యాలు కలగాలని, త్వరగా బయటకు రావాలని పూజలు చేసారు. సైకో పాలన పోవాలి. సైకిల్ పాలన కావాలంటూ నినాదాలు చేశారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మద్దతుగా అనంతపురంలో పార్టీ నాయకులు మసీదులో ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని 36వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రాజారాం ఆధ్వర్యంలో దువా చేశారు. తమ అభిమాన నేత చంద్రబాబు జైలు నుంచి సురక్షితంగా బయటకు రావాలని కోరుతూ...ప్రార్థనలు నిర్వహించామని టీడీపీ ముస్లిం నేతలు తెలిపారు.
చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ.. నంద్యాల జిల్లా చిన్నదేవలాపురం గ్రామానికి చెందిన చింతల నారాయణ చేపట్టిన పాదయాత్రకు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చేరుకుంది. గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికి ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం అన్యాయమని చింతల నారాయణ అన్నారు. వినుకొండ మండలంలో అధికార పార్టీ నాయకులు.. ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వగ్రామం దేవలాపురం నుంచి రాజమహేంద్రవరం వరకు చేపట్టిన పాదయాత్రలో... ఇప్పటివరకు 300 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు చింతల నారాయణ తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ వైఎస్సార్ జిల్లా మైదుకూరులో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్‌పై పల్లెపల్లెకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపును ప్రజలకు వివరించి చైతన్యవంతులను చేస్తామన్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని, అక్రమ కేసులు కొట్టివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
వైఎస్సార్ జిల్లా కమలాపురం కార్యాలయం వద్ద చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ఖండిస్తూ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు 28వ రోజుకు చేరాయి. కమలాపురం మండలానికి చెందిన నాయకులు నిరసన దీక్షలో పాల్గొన్నారు.
Pujas About Chandrababu in AP: చంద్రబాబు నాయుడు కోసం టీడీపీ నేతల ప్రత్యేక పూజలు..